Vijay Agarwal : లండన్‌లో ఇండియన్ లాయర్‌కు షాక్.. విజయ్ అగర్వాల్ అరెస్ట్.!

Vijay Agarwal : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) భారీ మోసం కేసులో పరారీలో ఉన్న వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ తరఫున వాదిస్తున్న భారత ప్రముఖ క్రిమినల్ న్యాయవాది..

Update: 2026-08-20 06:19 GMT

vijay agarwal 

Vijay Agarwal : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) భారీ మోసం కేసులో పరారీలో ఉన్న వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ తరఫున వాదిస్తున్న భారత ప్రముఖ క్రిమినల్ న్యాయవాది విజయ్ అగర్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. లండన్‌లోని బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అరెస్ట్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

అసలు ఏం జరిగింది? మేఫేర్ ప్రాపర్టీ వివాదం

లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన మేఫేర్‌లోని ఒక ప్రాపర్టీకి సంబంధించి ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మే నెలలో ఆ ప్రాపర్టీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ ప్రారంభించారు. తనిఖీల సమయంలో అగర్వాల్‌తో పాటు మరో ముగ్గురు-నాలుగు గురు జూనియర్ లాయర్లు కూడా అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. యూకే (UK)లో పనిచేయడానికి అవసరమైన అధికారిక వర్క్ పర్మిట్ లేకుండానే అగర్వాల్ లండన్ నుంచి తన వృత్తిపరమైన కార్యకలాపాలు నిర్వహించారని, నిబంధనలను ఉల్లంఘించి సుదీర్ఘకాలం పాటు అక్కడ బస చేశారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

భారీగా నగదు స్వాధీనం ప్రచారంపై ఫ్యామిలీ స్పష్టత

తనిఖీల సమయంలో అధికారులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారని, ఆ డబ్బు మూలాలు స్పష్టంగా లేవని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలను విజయ్ అగర్వాల్ కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు తీవ్రంగా ఖండించారు. విజయ్ అగర్వాల్ వద్ద నుంచి ఎలాంటి నగదు రికవరీ కాలేదని, ఆర్థిక అక్రమాలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎలాంటి అధికారిక పత్రాలు లేదా ఆధారాలు లేకుండా నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు రాయడం సరికాదని, కేవలం ధృవీకరించిన సమాచారం ఆధారంగానే నివేదించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు UK హోమ్ ఆఫీస్ లేదా మెట్రోపాలిటన్ పోలీస్ నుంచి ఈ అరెస్ట్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మెహుల్ చోక్సీ కేసుతో లింక్?

విజయ్ అగర్వాల్ భారతదేశంలో అత్యంత వివాదాస్పద , హై-ప్రొఫైల్ కేసులను వాదించడంలో ప్రసిద్ధి చెందారు. కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీకి ఆయన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టుల్లో న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. చోక్సీకి చెందిన నల్లధనాన్ని నిర్వహించడంలో లేదా మళ్లించడంలో అగర్వాల్ సహాయపడ్డారంటూ వస్తున్న వార్తలను కూడా ఆయన వర్గాలు పూర్తిగా తోసిపుచ్చాయి. ప్రస్తుతం అగర్వాల్ ఈ అంశంపై నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోగా, వర్క్ పర్మిట్ లేకపోవడం వల్లే ఈ ఇమ్మిగ్రేషన్ చిక్కులు వచ్చి పడ్డాయా లేక దీని వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయా అనేది అధికారిక ప్రకటన వస్తే తప్ప స్పష్టత రాదు.

Tags:    

Similar News