Hotel Fire: రెండు రోజుల వ్యవధిలోనే మరో ఘోరం.. హోటల్ అగ్నిప్రమాదంలో 9మంది బలి

Hotel Fire: కోల్‌కతా నగరంలోని ప్రముఖ హోటల్‌లో హఠాత్తుగా చెలరేగిన దట్టమైన పొగ కారణముగా ఊపిరాడక తొమ్మిది మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు.

Update: 2026-08-19 04:07 GMT

Fire Accident

Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సెంట్రల్ ప్రాంతంలో ఉన్న మిర్జా గాలిబ్ స్ట్రీట్ వద్ద బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ భయంకర ఘటన వెలుగుచూసింది. మల్టీ-హోటల్ సముదాయంలోని హోటల్ షికాలీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న పర్యాటకులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే హోటల్ అంతటా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి లోపల ఉన్నవారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది.

వైద్యం కోసం వచ్చి అనంత లోకాలకు..

ఈ ప్రమాదంలో మరణించిన తొమ్మిది మంది బాధితులూ బంగ్లాదేశ్ దేశస్థులేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరంతా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి ఇక్కడ గదులు అద్దెకు తీసుకున్నారు. రోగాన్ని నయం చేసుకుని స్వదేశానికి తిరుగుపయనం అవుదామనుకున్న వారిని మృత్యువు పొగ రూపంలో వచ్చి కబళించింది. మంటల కన్నా ఎక్కువగా ఊపిరాడకపోవడం వల్లే వారంతా సజీవసమాధి అయ్యారని అధికారులు వెల్లడించారు.

రెస్క్యూ బృందాల తీవ్ర శ్రమ.. యజమానుల అరెస్ట్

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్ మెట్ల మార్గం మొత్తం పొగతో నిండిపోవడంతో పై అంతస్తులకు చేరుకోవడం రెస్క్యూ బృందాలకు ఎంతో సవాలుగా మారింది. ఏదేమైనా సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించి దాదాపు 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన ఆరుగురిని కలకత్తా మెడికల్ కాలేజీకి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే హోటల్ యజమానులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

వరుస ఘటనలతో భద్రతపై ప్రశ్నలు

తారాపీఠ్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో భారీ ప్రమాదం జరిగి తొమ్మిది మంది మరణించిన రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ ఇలాంటి ఘటన పునరావృతమవ్వడం గమనార్హం. వరుస ప్రమాదాల నేపథ్యంలో చిన్న చిన్న హోటళ్లలో కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలాన్ని రాష్ట్ర మంత్రి కౌశిక్ చౌధరి సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల అసలు కారణాలు తెలుసుకోవడానికి విచారణ వేగవంతం చేశారు.

Tags:    

Similar News