Sabarimala Case : శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. సంప్రదాయం గెలుస్తుందా? సమానత్వం నిలుస్తుందా?
Sabarimala Case : శబరిమల ఆలయంలో మహిళా ప్రవేశంపై సుప్రీంకోర్టు 9 మంది సభ్యుల ధర్మాసనం ఏప్రిల్ 7 నుంచి విచారణ జరపనుంది. మత స్వేచ్ఛ, సమానత్వ హక్కుల మధ్య సమతుల్యతను ఈ బెంచ్ తేల్చనుంది.
Sabarimala Case
Sabarimala Case : దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న కేరళలోని శబరిమల ఆలయ మహిళా ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఈ వివాదంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఏకంగా 9 మంది న్యాయమూర్తులతో కూడిన భారీ రాజ్యాంగ ధర్మాసనం రంగంలోకి దిగుతోంది. ఏప్రిల్ 7 నుంచి ఈ విచారణ ప్రారంభం కానుంది. మతం, సంప్రదాయం, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుల మధ్య ఉన్న సన్నని గీతను ఈ తీర్పు శాశ్వతంగా నిర్ణయించనుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అధ్యక్షతన ఈ 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఇందులో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ ఆర్ మహాదేవన్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనం కేవలం శబరిమల అంశమే కాకుండా, మతపరమైన ఆచారాల్లో న్యాయస్థానాలు ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చు అనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నలను కూడా లోతుగా పరిశీలించనుంది.
ఈ కేసు పరిధి ఇప్పుడు చాలా విస్తృతమైంది. ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశించడం, పార్శీ మహిళల హక్కులు, జైన్ మతంలోని కొన్ని ఆచారాలపై కూడా ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వంటి సంస్థలు కూడా ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యాయి. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ (Article 25), సమానత్వ హక్కు (Article 14) మధ్య సమతుల్యతను ఈ ధర్మాసనం తేల్చాల్సి ఉంది.
2018 నాటి సంచలన తీర్పు.. అప్పుడు ఏం జరిగింది?
సెప్టెంబర్ 2018లో అప్పటి సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 మంది జడ్జిల ధర్మాసనం 4:1 మెజారిటీతో అన్ని వయసుల మహిళలు శబరిమల వెళ్లవచ్చని తీర్పు ఇచ్చింది. భక్తిలో లింగ వివక్ష ఉండకూడదని ఆనాడు కోర్టు పేర్కొంది. అయితే, ఆ బెంచ్‌లో ఉన్న ఏకైక మహిళా జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా మాత్రం దీనితో విభేదించారు. మతపరమైన నమ్మకాల్లో కోర్టుల జోక్యం పరిమితంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ తీర్పు తర్వాతే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి, వందలాది రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.
భక్తుల వాదన
శబరిమల అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి రూపంలో కొలువై ఉంటారని, అందుకే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలపై ఈ నియమం ఉందని భక్తులు వాదిస్తున్నారు. ఇది మహిళా వ్యతిరేకత కాదని, కేవలం ఆ ఆలయ విశిష్టతకు సంబంధించిన సంప్రదాయమని చెబుతున్నారు. దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో మహిళలకు అనుమతి ఉందని, కేవలం శబరిమల లోనే ఈ ప్రత్యేక నిబంధన ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 9 మంది జడ్జిలు ఇచ్చే తీర్పు భారతదేశ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.