Bhopal AIIMS Horror: AIIMSలో ఘోరం.. శవాలకు వాడే కెమికల్‌ను చిన్నారికి ఎక్కించారు.!

Bhopal AIIMS Horror: భోపాల్ ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న మూడేళ్ల పసిబాబుకు..

Update: 2026-06-14 06:50 GMT

Bhopal AIIMS Horror

Bhopal AIIMS Horror: భోపాల్ ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న మూడేళ్ల పసిబాబుకు, డ్యూటీలో ఉన్న నర్సు మందుకు బదులు శవాలను కుళ్లిపోకుండా దాచే 'ఫార్మలిన్' అనే ప్రమాదకరమైన కెమికల్‌ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించింది. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన అంతర్గత విచారణ నివేదిక బయటకు రావడంతో, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు నర్సులపై పోలీసులు తాజాగా క్రిమినల్ కేసు నమోదు చేశారు.

తండ్రి వద్దు అంటున్నా వినకుండా..

సాగర్ జిల్లాకు చెందిన సిద్ధార్థ్ యాదవ్ తన మూడేళ్ల కొడుకు సార్థక్ యాదవ్‌ను క్యాన్సర్ చికిత్స కోసం భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించాడు. బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో పీడియాట్రిక్ వార్డులో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఒకరోజు ఉదయం బాబుకు ఎక్కిస్తున్న సెలైన్ (IV line) బ్లాక్ అయింది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న నర్సు మధుబాల శర్మ, వార్డులో పక్కనే ఉన్న ఒక సిరంజిని తీసుకుని సెలైన్ బాటిల్‌లోకి ఎక్కించడానికి సిద్ధమైంది. ఆ సిరంజిపై 'F' అని రాసి ఉంది.

అది చూసిన బాబు తండ్రి సిద్ధార్థ్.. 'అది వేరే ఏదో కెమికల్ లా ఉంది, బాబుకు ఎక్కించవద్దు' అని మూడు సార్లు నర్సును బ్రతిమిలాడాడు. కానీ ఆ నర్సు వినకుండా, "ఇక్కడ డాక్టర్‌ని నేనా.. నువ్వా?" అంటూ గద్దించి, ఆ కెమికల్‌ను బాబు శరీరంలోకి ఎక్కించేసింది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చిన్నారి స్పృహ కోల్పోయాడు. పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. ఆ పసికందు ఉదయాన్నే కన్నుమూశాడు.

నిజం దాచేందుకు హాస్పిటల్ స్టాఫ్ ప్రయత్నం?

బాబు చనిపోయాక తమ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని హాస్పిటల్ సిబ్బంది సెలైన్ బాటిల్‌ను దాచడానికి ప్రయత్నించినట్లు తండ్రి ఆరోపించాడు. తాను ఆ బాటిల్‌ను పట్టుకున్నప్పటికీ, స్టాఫ్ బలవంతంగా లాక్కున్నారని చెప్పాడు. ఆ తర్వాత ఎయిమ్స్ యాజమాన్యం దీనిపై అంతర్గత విచారణ జరిపింది. ఆ విచారణలో నర్సుల ఘోర నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని తేలింది. బయాప్సీ శాంపిల్స్ దాచడానికి సిరంజిలో తీసి ఉంచిన ఫార్మలిన్ కెమికల్‌ను, ఏమాత్రం చూసుకోకుండా బాబుకు ఎక్కించారని నివేదికలో స్పష్టమైంది.

ఇద్దరు నర్సులపై కేసు నమోదు

ఈ విచారణ నివేదిక ఆధారంగా బాగ్సేవానియా పోలీసులు ఇద్దరు నర్సులపై కేసు నమోదు చేశారు. ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు మధుబాల శర్మపై నిర్లక్ష్యపు చావుకు కారణమైనందుకు (BNS సెక్షన్ 106(1)), అలాగే ఆ ప్రమాదకరమైన కెమికల్‌ను సురక్షితంగా దాచకుండా వార్డులో వదిలేసినందుకు మరో నర్సు అనుక గుజరాతిపై కేసు పెట్టారు. ప్రస్తుతం ఎయిమ్స్ యాజమాన్యం వీరిద్దరినీ సస్పెండ్ చేయగా, పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

అసలు 'ఫార్మలిన్' అంటే ఏమిటి?

ఫార్మలిన్ అనేది ఫార్మాల్డిహైడ్ గ్యాస్‌తో కూడిన ఒక రసాయన ద్రవం. ఇది మనుషులకు అత్యంత విషపూరితమైనది. మెడికల్ లాబొరేటరీలలో బయాప్సీ కోసం తీసే శరీర భాగాల ముక్కలు పాడవకుండా ఉండటానికి, అలాగే మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల పరిశోధనల కోసం ఉంచే శవాలు కుళ్లిపోకుండా భద్రపరచడానికి ఈ కెమికల్‌ను వాడుతుంటారు. అలాంటి ఘాటైన విషాన్ని పసిబాబు శరీరంలోకి ఎక్కించడం వల్లే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.

Tags:    

Similar News