Suryapet: ప్రతి పౌరుడూ యూనిఫాం లేని పోలీస్ కావాలి.. ఎస్పీ నరసింహ
Suryapet: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం కుడకుడ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభ.
Suryapet: ప్రతి పౌరుడూ యూనిఫాం లేని పోలీస్ కావాలి.. ఎస్పీ నరసింహ
సూర్యాపేట: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చివ్వేంల మండలం కుడకుడ గ్రామం, 1వ వార్డులో గురువారం వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రజలు, సమాజ అభివృద్ధికి ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలతో కృషి చేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కారం చూపడమే గ్రామ, వార్డు సభల ముఖ్య ఉద్దేశమని అన్నారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని చెప్పారు.
ప్రజల ధన, ప్రాణ రక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందన్నారు. స్థానిక సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు, ఆకతాయిలపై సమాచారం ఇవ్వడంలో ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్ లాగా ఉండాలని పిలుపునిచ్చారు. గొడవలు పెట్టుకుంటే కేసుల పాలై ఇబ్బందులు పడతారని, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందని, రోడ్డు ప్రమాదాలపై జాగ్రత్తలు పాటించాలని కోరారు. యువతను గంజాయి వంటి మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడే బాధ్యత అందరిపైనా ఉందని, సంబంధిత సమాచారం పోలీసులకు అందించాలని అన్నారు. సోషల్ మీడియా బ్లూ లింకులు, బహుమతుల ఆశతో వ్యక్తిగత వివరాలు ఇచ్చి సైబర్ మోసాలకు గురికావద్దని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో బాధితుల ఇళ్లకే వెళ్లి డయల్ 100, 112 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేసి పత్రాలు అందిస్తున్నామని ఎస్పీ వివరించారు.
ఈ సభలో మున్సిపల్ ఛైర్మెన్, కమిషనర్, స్థానిక కౌన్సిలర్, వైద్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ఎస్ఐ, గ్రామస్తులు పాల్గొన్నారు.