Suryapet: సూర్యాపేటలో దారుణం.. చిన్నారి హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు!
Suryapet: సూర్యాపేటలో దారుణం. సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని 6 ఏళ్ల బాలుడు టైసన్‌ను హత్య చేసిన నిందితురాలు నల్లాల వాణికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు.
Suryapet: సూర్యాపేటలో దారుణం.. చిన్నారి హత్య కేసులో నిందితురాలికి జీవిత ఖైదు!
సూర్యాపేట: ప్రియుడితో సహజీవనానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతడి 6 ఏళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన కేసులో సూర్యాపేట జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితురాలైన నల్లాల వాణికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది.
2023లో సూర్యాపేట రూరల్ పరిధిలోని మూడో విడత ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. గరిడేపల్లి మండలం కొత్తగూడెంకు చెందిన మచ్చ మధు కుమారుడు టైసన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి నాయనమ్మ మచ్చ కమలమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోస్టుమార్టం నివేదికలో టైసన్ గొంతు నులిమి హత్యకు గురైనట్లు తేలింది. మచ్చ మధు, కోడి స్వప్న దంపతుల కుమారుడే టైసన్. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో స్వప్న భర్త, కుమారుడిని వదిలి వెళ్లిపోయింది. అనంతరం మధు మోతె మండలం సర్వారం గ్రామానికి చెందిన నల్లాల వాణితో పరిచయం పెంచుకొని సహజీవనం చేస్తున్నాడు.
పిల్లాడు టైసన్ తమ సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వాణి, అతడిని గొంతు నులిమి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. సూర్యాపేట రూరల్ పోలీసులు బలమైన సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసు విచారించిన సూర్యాపేట జిల్లా జడ్జి లక్ష్మీ ప్రసన్న నల్లాల వాణిని నిందితురాలిగా తేల్చి ఈ తీర్పు ఇచ్చారు. నేరానికి పాల్పడితే ఎన్నాళ్లకైనా శిక్ష తప్పదని జిల్లా ఎస్పీ నరసింహ IPS హెచ్చరించారు.
ఈ కేసు సమాజానికి ఒక గుణపాఠంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.