Suryapet: కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి!
Suryapet: నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి సూర్యాపేటలో పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Suryapet: కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి!
సూర్యాపేట: నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయాన్నే జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్‌తో పాటు ఎస్వీ కళాశాల గ్రౌండ్, ఆడిటోరియం, షటిల్ కోర్ట్, ఫుట్ బాల్ కోర్ట్, పబ్లిక్ క్లబ్, జిమ్, ప్రముఖ చౌరస్తాల్లోని టీ స్టాల్స్ వద్ద ఆయన పర్యటించి మార్నింగ్ వాకర్స్, ఉద్యోగులు, నిరుద్యోగ యువత, పట్టభద్రులతో ముచ్చటించారు. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంట్‌తో పాటు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, రైతుబంధు, బీమా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని విమర్శించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు రాక యువత కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, ఉద్యోగులు డీఏలు, పీఆర్సీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిరీక్షిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా, మూసీ కారణంగా పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోవడంతో పాటు, ఏఐ ప్రభావంతో ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కోల్పోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ప్రతిపక్షాన్ని బలోపేతం చేస్తేనే ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తుందన్నారు. రాబోయే ఏడాదిన్నర కాలంలోనైనా యువతకు నోటిఫికేషన్లు రావాలన్నా, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు అందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు దక్కాలన్నా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలని, అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
ఒకప్పుడు వెనుకబడిన సూర్యాపేట నియోజకవర్గం కేసీఆర్ హయాంలో, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్, రోడ్లు, మౌలిక సదుపాయాలతో అద్భుత ప్రగతి సాధించిందని కొనియాడారు. నాడు నిధుల వరద పారితే, నేడు ఒక్క రూపాయి నిధి కూడా రాని పరిస్థితి నెలకొందని, కాబట్టి పట్టభద్రులందరూ విజ్ఞతతో, విచక్షణతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.