Kamal Haasan: దేశం కోసం ఇంధనాన్ని ఆదా చేయలేమా? ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి..
Kamal Haasan: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రులతో జాతీయ సదస్సు నిర్వహించాలని కోరారు.
Kamal Haasan: దేశం కోసం ఇంధనాన్ని ఆదా చేయలేమా? ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి..
Kamal Haasan: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కీలక అడుగు వేశారు. ఈ సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను రక్షించేందుకు జాతీయ స్థాయిలో ఒక బలమైన సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తక్షణమే ఒక 'జాతీయ సదస్సు' ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సంక్షోభ సమయంలో ఇంధనాన్ని (Fossil Fuels) పొదుపు చేయాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును తాను పూర్తిగా సమర్థిస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన పోస్ట్ చేసిన 4 నిమిషాల నిడివి గల ప్రత్యేక వీడియో సందేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇలాంటి క్లిష్ట సమయాల్లో జాతీయ బాధ్యత అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాలు స్తంభించిపోయాయి. దీని ప్రభావం మన వంటిళ్లపై పడుతోంది. చమురు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.. కానీ దేశం శాశ్వతంగా ఉంటుంది" అని నాడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పార్లమెంట్‌లో చేసిన చారిత్రాత్మక వ్యాఖ్యలను కమల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్యాగాలనేవి కేవలం పౌరుల నుంచి మాత్రమే ఆశించకూడదని, ఆర్థిక భారాన్ని ప్రభుత్వాలు కూడా పంచుకోవాలని హితవు పలికారు. ప్రజలపై ద్రవ్యోల్బణ (Inflation) భారాన్ని తగ్గించేందుకు కమల్ హాసన్ రెండు తక్షణ చర్యలను సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను తక్షణమే తగ్గించాలి. మెట్రో, రైలు ఛార్జీలను తగ్గించడం ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వాహనాలను వదిలి ప్రజా రవాణాను (Public Transport) ఎంచుకునేలా ప్రోత్సహించాలి.
దేశం గతంలో ఎదుర్కొన్న యుద్ధ సమయాలను కమల్ ఉదహరించారు. 1962 చైనా యుద్ధ సమయంలో సరిహద్దుల్లోని సైనికుల కోసం భారతీయ మహిళలు తమ ఒంటిపై బంగారాన్ని విరాళంగా ఇచ్చారని, 1965 పాకిస్థాన్ యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి పిలుపుతో దేశ ప్రజలంతా వారానికి ఒక పూట భోజనం మానేశారని గుర్తు చేశారు. మన పూర్వీకులే అంతటి త్యాగాలు చేసినప్పుడు, మనం దేశం కోసం కనీసం ఇంధనాన్ని ఆదా చేయలేమా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో, మోదీ ప్రభుత్వ హయాంలో పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం గణనీయంగా వృద్ధి చెందడంపై కమల్ ప్రశంసలు కురిపించారు. విదేశీ చమురు దిగుమతులపై భారం తగ్గాలంటే సౌర, పవన, అణుశక్తి చాలా కీలకమని నొక్కిచెప్పారు. ఈ సంక్షోభాన్ని భారతీయులంతా ఒకే తాటిపైకి వచ్చి ఎదుర్కొంటే దేశం మరింత బలంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.