Rajanala Life Story: కాటేసిన కాలంః విలన్‌గా భయపెట్టి...జ్యోతిష్యుడిగా కడుపునింపుకున్న నటుడు
తెలుగు చలనచిత్ర చరిత్రలో వైభవం నుంచి విషాదం వరకు సాగిన నటుల జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అగ్రగణ్యుడు, క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజనాల కాళేశ్వరరావు.
Rajanala Life Story: తెలుగు చలనచిత్ర చరిత్రలో వైభవం నుంచి విషాదం వరకు సాగిన నటుల జీవితాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అగ్రగణ్యుడు, క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు రాజనాల కాళేశ్వరరావు. వెండితెరపై తన పదునైన కళ్ళు, వికటాట్టహాసంతో కోట్లాది మంది ప్రేక్షకులను భయపెట్టిన ఈ మహానటుడు, జీవిత చరమాంకంలో ఒక కాలు కోల్పోయి, పొట్టకూటి కోసం జ్యోతిష్యం చెప్పుకుంటూ బతికారు అనే నిజం ఇప్పటి తరానికి ఒక పెద్ద ఆశ్చర్యం. స్టార్ హీరోలతో సమానంగా సంపాదించిన ఒక అద్భుత నటుడిని కాలం ఎలా కాటేసిందో తెలిపే హృదయవిదారక కథ ఇది.
హాలీవుడ్ దాకా వెళ్లిన ఏకైక విలన్
1928 జనవరి 3న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల, నాటకాలపై పిచ్చితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన 'ప్రతిజ్ఞ' చిత్రంతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, దాదాపు 400 పైచిలుకు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో కంసుడు, శిశుపాలుడు, బ్రిటిష్ మేజర్ గూడాల్ వంటి పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. అసక్తికరమైన అంశం ఏమంటే... 1966లో మాయా ది మ్యాగ్నిఫిషెంట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తొలి తెలుగు నటుడిగా రాజనాల చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆయన క్రూరత్వాన్ని చూసి, నిజ జీవితంలోనూ జనం భయపడేవారు. 1968లో 'వరకట్నం' సినిమా షూటింగ్ కోసం తాడేపల్లిగూడెం వెళ్లినప్పుడు, ఆయన్ను చూసి స్థానిక మహిళలు భయంతో పరుగులు తీశారంటే ఆయన నటన ఎంత సహజంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
జీవితాన్ని ముంచేసిన దానగుణం - వరుస విషాదాలు
రాజనాల పతనానికి ప్రధాన కారణం ఆయనకున్న అమాయకపు దానగుణం. సీనీ రంగంలో వచ్చిన డబ్బును వచ్చినట్టు దానం చేసేశారు. దీనికి తోడు 1979లో భార్య మరణం ఆయన్ను కోలుకోలేని దెబ్బ తీసింది. 1984లో ఒక కుమారుడు మూర్ఛ వ్యాధితో మరణించగా, మరో కుమారుడు ముంబైలో అదృశ్యమయ్యాడు. కూతురు, అల్లుడిపై భారం కావడం ఇష్టం లేక 1991లో మద్రాసులోని ఆస్తులన్నీ అమ్మేసి రెండో భార్యతో హైదరాబాద్ వచ్చేశారు. ఒకానొక దశలో చేతిలో రూపాయి లేక, గతంలో తాను అవమానించిన నటుడు శోభన్ బాబు ఇంటికే సహాయం కోసం వెళ్లారు. శోభన్ బాబు పాత పగలు మనసులో పెట్టుకోకుండా రూ. 20,000 ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు.
చివరి రోజుల్లో జ్యోతిష్యుడిగా జీవితం
1995లో ‘తెలుగు వీర లేవరా’ సినిమా షూటింగ్‌లో రాజనాల కాలికి తీవ్రమైన గాయమైంది. షుగర్ వ్యాధి కారణంగా ఇన్ఫెక్షన్ ఎక్కువవడంతో వైద్యులు ఆయన ఒక కాలును తొలగించాల్సి వచ్చింది. దాంతో సినిమా అవకాశాలు పూర్తిగా ఆగిపోయాయి. ఆర్థిక కష్టాలు తారస్థాయికి చేరడంతో, బతుకు బండిని లాగడానికి ఆయనకు తెలిసిన జ్యోతిష్యాన్ని నమ్ముకుని, ప్రజలకు జాతకాలు చెప్తూ కడుపు నింపుకున్నారు. వెండితెరకు క్రూరత్వాన్ని నేర్పిన ఆ వికటాట్టహాసం, 1998 మే 21న గుండెపోటుతో ఎప్పటికీ మూగబోయింది. కోట్లకు అధిపతి అయినా, చివరి రోజుల్లో ఒక కాలు లేక జ్యోతిష్యుడిగా మారిన రాజనాల జీవితం.. సినిమా స్క్రిప్ట్ కంటే భయంకరమైన మలుపులతో ముగిసింది.