Singareni: సింగరేణిలో రూ.కోటి ఉచిత బీమా
Singareni: రూపాయి ప్రీమియం లేకుండా రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా, రూ.15 లక్షల సహజ మరణ బీమా.
Singareni: సింగరేణిలో రూ.కోటి ఉచిత బీమా
సింగరేణి: కారుణ్య నియామకం ద్వారా ఆయన కుమారుడు సంతోష్ ఉద్యోగంలో చేరాడు. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు సంతోష్ను కబళించింది. ఆయన సింగరేణిలో చేరి కూడా కేవలం 18 నెలలు మాత్రమే. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రాజయ్య కుటుంబానికి ఆయన కుమారుడు సంతోషే ఏకైక దిక్కు. సంతోష్ పనిచేసిన 18 నెలల సర్వీసుకు వచ్చే టర్మినల్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ.
ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజయ్య కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో ప్రారంభించిన రూ.కోటి ప్రమాద బీమా పథకమే ఓ పెద్దకొడుకులా ఆదుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య వృద్ధ దంపతులకు ప్రస్తుతం ఆర్థికభరోసాగా మారింది. చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు పెండ్రి లత. ఈమె భర్త రంజిత్ కుమార్. సింగరేణిలో పనిచేసేవాడు. పుట్టిన నెల రోజుల కొడుకును చూసి రావడానికి వెళ్లి వస్తూ ఆయన ప్రమాదవశాత్తు మరణించాడు
ఆయనకు తండ్రి కూడా లేడు. దీంతో ఆయనపైనే ఆధారపడిన భార్య లత, తల్లి, నెల రోజుల కుమారుడు ఒంటరివారయ్యారు. అయితే ఆయనకు సింగరేణితో ఒప్పందం ఉన్న బ్యాంక్ లో శాలరీ ఖాతా ఉండటంతో వారికి కోటి రూపాయలు బ్యాంకు నుంచి వచ్చాయి.. ఈ చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు ఇంధన శాఖామాత్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు స్వయంగా అందజేశారు.
దూరమైన తన భర్తను తిరిగి తీసుకురాలేకపోయినా… ఆయన నెరవేర్చే బాధ్యతను ఈ సొమ్ము ద్వారా తీర్చగలిగే అవకాశం కలిగిందని, తనకు, తన కుమారుడి భవిష్యత్కు ఇది ఎంతో దోహదపడుతుందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనకు కూడా అమ్మానాన్న లేరని, ఈ పథకమే లేకపోతే తమ కుటుంబం, కుమారుడి భవిష్యత్ అంధకారమయ్యేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కేవలం రెండు కుటుంబాల విషయమే కాదు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణి లో ప్రవేశపెట్టిన ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసాను పొందిన 40 మందికి పైగా కుటుంబాల మనోగతం. ఇప్పుడు ఇది సింగరేణిలోనే కాదు దేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ చర్య.
ప్రమాదాల వల్ల కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా కుంగిపోయి ఛిన్నాభిన్నం అయ్యే పరిస్థితుల్లో చిక్కుకున్న జీవితాలకు భరోసాగా నిలుస్తోంది. ఉచిత ప్రమాద బీమా పథకం. రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉద్యోగులకు, పొరుగు సేవల సిబ్బందికి సింగరేణిలో అమలవుతున్న ప్రమాద బీమా పథకం పై ప్రత్యేక కథనం.
కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేయాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి యాజమాన్యం దేశంలో తొలిసారిగా 1.25 కోట్ల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సింగరేణి సంస్థలో అమలు చేసింది. 2024లో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లుల చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా బీమా రంగంలో ఒక విప్లవాత్మక చర్యగా మారింది.
బొగ్గు కంపెనీలతో పాటు, ఇతర సంస్థలు కూడా ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి సింగరేణి సంస్థ స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో సింగరేణి సంస్థ తీసుకున్న ప్రత్యేక చొరవ వల్ల సింగరేణి ఉద్యోగులు తమ శాలరీ ఖాతాలు కలిగి ఉన్న పలు బ్యాంకుల వారు ఈ ప్రమాద బీమా పథకాన్ని అమలు జరుపుతున్నారు.
సింగరేణి ఉద్యోగులు కార్పొరేట్ శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ప్రమాద బీమా పథకం కింద 1.25 కోట్ల రూపాయలను చెల్లించడానికి సింగరేణితో ఒప్పందం చేసుకొని అమలు జరుపుతున్నాయి.
సింగరేణిలో అత్యధిక కార్మికులు శాలరీ ఖాతాలు కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులు కోటి రూపాయల ప్రమాద బీమా చెల్లింపునకు సింగరేణితో ఒప్పందం చేసుకొని అమలు జరుపుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 40,275 మంది ఉద్యోగులకు సింగరేణి ప్రాంతంలో బ్రాంచీలు కలిగి ఉన్న వివిధ బ్యాంకుల ద్వారా యాజమాన్యం నెలనెలా జీతాలు చెల్లిస్తోంది.
సింగరేణి ఉద్యోగులు వ్యక్తిగతంగా పలు ప్రమాద బీమా పథకాలలో సభ్యులుగా ఉన్నప్పటికీ ఆ పథకాల కింద నిబంధనల ప్రకారం ఎంతో కొంత సొమ్మును ఇన్సూరెన్స్ కింద చెల్లిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సింగరేణిలో పలు బ్యాంకులు అమలు జరుపుతున్న ప్రమాద బీమా పథకానికి ఎవరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒప్పందం జరిగింది. దీనిపై కార్మికులు, కార్మిక సంఘాలు తమ హర్షం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు అండగా, ఆర్థిక భరోసాగా..
సింగరేణి ఉద్యోగులు ఎవరైనా అనుకోని ప్రమాదాలలో మృతి చెందినప్పుడు వారి కుటుంబాలు తీవ్రమైన మానసిక వేదనతో పాటు, ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో సంపాదించే దిక్కు కోల్పోవడంతో పెళ్లి కావలసిన పిల్లలు లేదా చదువుకునే బిడ్డలు, ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక పరమైన చిక్కుల్లో ఇరుక్కుపోతారు. ఇటువంటి సమయంలో ప్రమాద బీమా పథకం వారికి గొప్ప ఆర్థిక భరోసాగా అండగా ఉంటుంది.
ప్రమాద బీమా పథకాన్ని వ్యక్తి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 1 కోటి రూపాయల నుండి 1.25 కోట్ల రూపాయల వరకు అందజేయడంతో వారికి ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. ఈ ఉచిత ప్రమాద బీమా పథకం కింద రెండేళ్ల కాలంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 32 మందికి సుమారు 28 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది.
అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 13 మందికి సుమారు 13 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. ఈ పథకం అమలుపై కార్మిక కుటుంబాల వారు హర్షం ప్రకటిస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో మునిగి ఉన్న సభ్యులకు, వారి భవిష్యత్తుకు ప్రమాద బీమా పథకం గొప్ప అండగా ఉంటుందని పేర్కొంటున్నారు. .
వికలాంగులైన వారికి కూడా ప్రమాద బీమా పథకం...
ప్రమాదంలో మృతి చెందిన వారికే కాకుండా కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి లేదా ఇతర అవయవాలు ప్రమాదానికి గురై పాక్షిక, శాశ్వత అంగ వైకల్యం చెందినప్పటికీ కూడా బ్యాంకులు ప్రమాద బీమా పథకం అమలు జరుపుతున్నాయి. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికుడు సత్యనారాయణ గని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందు ల్లో చిక్కుకుంది. ఈ సమయంలో బ్యాంకు వారు ప్రమాద బీమా పథకం కింద ఆ కార్మిక కుటుంబానికి
1 కోటి రూపాయలను అందజేశారు.
సహజ మరణానికి కూడా ….
ప్రమాద బీమాతో పాటు, సహజ మరణానికి కూడా 10 లక్షల రూపాయల ఉచిత బీమా పథకాన్ని అమలు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు సింగరేణితో ఒప్పందం చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వారు గరిష్టంగా రూ.15 లక్షల సహజ బీమా పథకాన్ని అందిస్తోండటం విశేషం.
సాధారణంగా ఇటువంటి బీమా పథకంలో చేరాలంటే ప్రీమియం అమౌంట్ గా ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేస్తున్న ప్రదేశాలు, వయస్సును బట్టి పెద్ద మొత్తంలో ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ ఫలితంగా ఎటువంటి ప్రీమియం చెల్లింపు లేకుండానే ఉచితంగా ఈ 10 లక్షల రూపాయల సహజ మరణ బీమా పథకాన్ని కూడా బ్యాంకులు అమలు జరుపుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణిలో మొదలైన ఈ పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు మొదటగా రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో అమలు చేశారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేశారు.
ప్రస్తుతం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపజేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ఇప్పుడు అమలవుతున్న ప్రమాద బీమా పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ చర్యే ఒక దిక్సూచిగా మారడటం విశేషం.
నామ మాత్రపు ప్రీమియంతో ఆరోగ్య బీమా....
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ప్రవేశపెట్టిన ఈ పథకానికి అనుబంధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో కార్పోరేట్ శాలరీ ఖాతా కలిగి ఉన్న వారికి నామ మాత్రపు ప్రీమియంతో 50 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను కూడా అమలు చేయడం మరో విశేషం. ఇందులో ఉద్యోగి, అతడి జీవిత భాగస్వామి, 25 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలకు ఏడాదికి 8,906 రూపాయల ప్రీమియంతో 50 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది.
ఇది 63 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రీమియంలో స్వల్ప పెరుగుదలతో ఆరోగ్య బీమాను కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆరోగ్య భద్రత, జీవిత భద్రత ఉద్యోగులకు అత్యవసరం. ఈ రెండింటి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో సింగరేణి ఉద్యోగులకు గట్టి భరోసా లభించిందని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పొరుగు సేవల సిబ్బందికీ 40 లక్షల రూపాయల ప్రమాద బీమా...
సింగరేణిలో దాదాపు 30 వేల మంది పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సంక్షేమం విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీరి కుటుంబాలకు కూడా బీమా ద్వారా భద్రత కల్పించేందుకు వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరిపేలా సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు పొరుగు సేవల ఉద్యోగులకు కూడా 40 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడానికి ముందుకు వచ్చారు.
అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంకు వారు 30 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని కల్పిస్తుండటం విశేషం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్టీపీపీకి చెందిన కంబాల రాజేష్ మరణించడానికి ఒక నెల ముందే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో బ్యాంక్ ఖాతా తెరిచాడు. ఆ మరుసటి నెలలోనే రోడ్డు ప్రమాదంతో మృతిచెందగా.. ఆయన జీతం 25 వేలు ఉండటంతో బ్యాంక్ వారు రూ.50 లక్షల ప్రమాద బీమాను చెల్లించడం జరిగింది. దీంతో ఏడేళ్ల లోపు వయస్సున్న ఇద్దరు పిల్లలు, వారి జీవిత భాగస్వామికి కొంత ఆసరాగా మారింది. ఇంకా మరికొందరు పొరుగు సేవల సిబ్బంది కుటుంబాలకు ఈ ప్రయోజనాన్ని చెల్లించడం జరిగింది.
విశ్రాంత సింగరేణి ఉద్యోగులకూ ఉచిత ప్రమాద బీమా....
సింగరేణిలో పనిచేసిన కాలంలోనే కాకుండా వారు 61 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ పొందిన అనంతరం కూడా ఈ ఉచిత ప్రమాద బీమాను కొనసాగించేలా చూడాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యాజమాన్యంతో సంప్రదింపులు జరిగింది. దీంతో చాలా బ్యాంకులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ పింఛన్ను బ్యాంక్ తమ బ్యాంక్ ద్వారా పొందిన పక్షంలో రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉచిత బీమా వర్తింపజేయడానికి అంగీకరించాయి.