Kothagudem: సింగరేణి ఎన్నికల వేళ కార్మిక సంఘాల మధ్య మాటల యుద్ధం!

Kothagudem: సింగరేణి ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్మిక సంఘాల మధ్య ప్రచార పోరు వేడెక్కింది.

Update: 2026-08-30 11:39 GMT

Kothagudem: సింగరేణి ఎన్నికల వేళ కార్మిక సంఘాల మధ్య మాటల యుద్ధం!

కొత్తగూడెం, ఆగస్టు 30: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కార్మిక సంఘాల మధ్య ప్రచార పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన కార్మిక సంఘాలు పరస్పరం విమర్శలు, ఆరోపణలు, కౌంటర్‌ ఎటాక్స్‌తో కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేందుకు అన్ని సంఘాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

తాజాగా ఏఐటీయూసీ చేపట్టిన సమ్మె, యాజమాన్యంతో జరిగిన చర్చలు, 23 ప్రధాన డిమాండ్లపై అంగీకారం వంటి అంశాలను ఆ సంఘం తన విజయాలుగా ప్రచారం చేస్తుండగా.. ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్‌టీయూసీతో పాటు టీబీజీకేఎస్‌ తీవ్ర స్థాయిలో కౌంటర్‌ ప్రచారాన్ని ప్రారంభించాయి.

“గతంలో అమలైన వాటినే కొత్త విజయాలుగా చెబుతున్నారు”

ఏఐటీయూసీ ప్రకటిస్తున్న 23 డిమాండ్లలో అనేక అంశాలు గతంలోనే అమలులోకి వచ్చినవని, మరికొన్ని ఇప్పటికే యాజమాన్యం అంగీకరించినవేనని ఐఎన్‌టీయూసీ ఆరోపిస్తోంది. గతంలో అమలైనవి, చట్టపరంగా కార్మికులకు ఉన్న హక్కులు, యాజమాన్యం ఎప్పటి నుంచో నిర్వహిస్తున్న ప్రక్రియలను ఇప్పుడు తమ పోరాట ఫలితాలుగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది.

“ఏఐటీయూసీ కొత్తగా సాధించిన అంశాలేమిటో కార్మికులకు స్పష్టంగా చెప్పాలి” అంటూ ఐఎన్‌టీయూసీ ప్రచారం చేస్తోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని కూడా ప్రశ్నిస్తోంది.

ఐఎన్‌టీయూసీ లేవనెత్తుతున్న అంశాలు

సర్వీసులో సహజ మరణం పొందిన కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం సాధించామని ఏఐటీయూసీ చెబుతున్నప్పటికీ, గతంలోనే రూ.1 కోటి ఇన్సూరెన్స్‌కు సంబంధించి బ్యాంకర్లతో ఒప్పందం జరిగిందని ఐఎన్‌టీయూసీ పేర్కొంటోంది.

ప్రతి నెలా మెడికల్‌ బోర్డులు నిర్వహించడం ఇప్పటికే ప్రారంభమైందని, గత రెండు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతోంది. వాస్తవ లాభాలను ప్రకటించడం కూడా సింగరేణిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని పేర్కొంటోంది.

ట్రాన్స్‌ఫర్లలో మూడు సంవత్సరాల నిబంధనను గతంలోనే తొలగించి ఏడాదికి మార్చారని, మారుపేర్ల సమస్యపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసి నెల రోజులకు పైగా గడిచిందని అంటోంది.

హైదరాబాద్‌లో సింగరేణి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు అంశం కూడా గతంలోనే అంగీకరించినదేనని, దిగిపోయిన కార్మికులకు వారం రోజుల చికిత్సా సౌకర్యం ప్రస్తుతం కూడా అమలులో ఉందని ఐఎన్‌టీయూసీ పేర్కొంటోంది.

అలాగే సింగరేణి విద్యాసంస్థల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలులోనే ఉందని, భద్రతా సామగ్రిని సకాలంలో అందించడం యాజమాన్యం బాధ్యతగా ఎప్పటి నుంచో కొనసాగుతోందని చెబుతోంది.

డిస్మిస్‌ అయిన కార్మికుల పెండింగ్‌ కేసులు, డిపెండెంట్‌ ఉద్యోగాల పెండింగ్‌ కేసుల విషయంలో ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారం లేదని విమర్శిస్తోంది. మైనింగ్‌ స్టాఫ్‌కు సూటబుల్‌ ఉద్యోగాల విషయంలో గతంలోనే ఒప్పందం జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని పేర్కొంటోంది.

కాంట్రాక్ట్‌ కార్మికులకు ఈఎస్‌ఐ వైద్యం చట్టపరమైన హక్కేనని, ఖాళీ పోస్టుల భర్తీ, క్యాడర్‌ స్కీమ్‌ సమస్యల పరిష్కారం వంటి అంశాలు కూడా యాజమాన్యం ఎప్పటి నుంచో చేపడుతున్న ప్రక్రియలేనని ఐఎన్‌టీయూసీ అంటోంది.

మెడికల్‌ ఫిట్‌ డిపెండెంట్లకు 149 ఆఫీస్‌ ఆర్డర్లు సాధించామని ఏఐటీయూసీ చెబుతున్నప్పటికీ, ఇప్పటికే 300 మందికి పైగా ఆఫీస్‌ ఆర్డర్లు జారీ అయ్యాయని ఐఎన్‌టీయూసీ వాదిస్తోంది. 250 గజాల సొంత ఇంటి స్థలం పథకంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొంటోంది.

“48 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు”

మరోవైపు టీబీజీకేఎస్‌ కూడా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలపై విమర్శలను తీవ్రతరం చేసింది. 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఏఐటీయూసీ 48 హామీలు, ఐఎన్‌టీయూసీ 36 హామీలు ఇచ్చాయని, రెండేళ్ల ఎనిమిది నెలలు గడిచినా వాటిలో ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీబీజీకేఎస్‌ విమర్శిస్తోంది.

ఆర్‌ఎల్‌సీతో చర్చలు జరిపి 23 ప్రధాన డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందంటూ ఏఐటీయూసీ ప్రచారం చేసుకుంటోందని, అయితే కార్మికుల ప్రధాన సమస్యలైన 250 గజాల ఇంటి స్థలం, రూ.20 లక్షల వడ్డీలేని రుణాలు, మారుపేర్ల సమస్య పరిష్కారం, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను రద్దు వంటి అంశాలు ఇంకా అమలుకు నోచుకోలేదని ఆరోపిస్తోంది.

లాభాల ప్రకటనలో జాప్యం, మెడికల్‌ బోర్డులో 100 శాతం న్యాయం, పిట్‌ కేసుల పరిష్కారం వంటి హామీల్లోనూ ఏఐటీయూసీ పూర్తిస్థాయిలో విఫలమైందని టీబీజీకేఎస్‌ విమర్శిస్తోంది.

సమ్మెపైనా రాజకీయ విమర్శలు

ఇదే సమయంలో ఏఐటీయూసీ ఇచ్చిన సమ్మె పిలుపుపైనా ప్రత్యర్థి సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఎన్నడూ రోడ్డెక్కని సింగరేణి అధికారులు నిరసన ర్యాలీలు, నిరాహార దీక్షలు చేపట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి.

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసమే ఏఐటీయూసీ ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చిందని టీబీజీకేఎస్‌ ఆరోపిస్తోంది. ఈ పరిణామాలను కార్మిక వర్గం గమనిస్తోందని, రాబోయే ఎన్నికల్లో కార్మికులు తమ వైపే ఉన్నారంటూ ఆ సంఘం ధీమా వ్యక్తం చేస్తోంది.

అసలు పరీక్ష.. హామీల అమలుపైనే

సింగరేణి ఎన్నికల ప్రచారం ముందుకు సాగుతున్న కొద్దీ ఇలాంటి కౌంటర్‌ ఎటాక్స్‌ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సాధించిన విజయాలను ఏఐటీయూసీ ప్రచారం చేస్తుండగా.. మరోవైపు అవి కొత్తగా సాధించినవి కావని ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్‌ ప్రత్యారోపణలు చేస్తున్నాయి.

అయితే ఆరోపణలు, ప్రత్యారోపణలకంటే కార్మికుల వాస్తవ సమస్యలపై ఎవరు స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తారు? గత హామీల్లో ఎన్ని అమలు చేశారు? భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు? అన్నదే ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. దీంతో సింగరేణి కార్మికులు ఆయా సంఘాల హామీలు, గత పనితీరును బేరీజు వేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది.

Tags:    

Similar News