Kothagudem: గోదావరి పుష్కర పనులు వేగవంతం భద్రాద్రి కలెక్టర్ అంకిత్!

Kothagudem: 2027 గోదావరి పుష్కరాలకు భద్రాచలం, పర్ణశాలలో ఏర్పాట్లు వేగవంతం. దేవాదాయ శాఖ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న భద్రాద్రి కలెక్టర్ అంకిత్.

Update: 2026-08-29 17:18 GMT

Kothagudem: గోదావరి పుష్కర పనులు వేగవంతం భద్రాద్రి కలెక్టర్ అంకిత్!

కొత్తగూడెం: వచ్చే ఏడాది 2027 జూన్ - జూలై నెలలో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని భద్రాద్రి జిల్లాలోని ఆయా పుష్కర ఘాట్ ల వద్ద భక్తుల సౌకర్యార్థం పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా సదుపాయాల కల్పన పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి హైదరాబాద్ నుండి శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంత రావులు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిన దృష్ట్యా, పుష్కర ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని వారు సూచించారు. ఇప్పటికే ఆమోదం పొందిన పనులను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి తక్షణమే ప్రారంభించాలని అన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం తగిన అనుభవం కలిగిన సీనియర్ అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించాలని అన్నారు.

భూసేకరణ అవసరమైన పక్షంలో వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. పుష్కరాలకు మరో పది నెలల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున సదుపాయాల కల్పన పనులను చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని హితవు పలికారు. వారం వారం పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నివేదికలు సమర్పించాలని సూచించారు.

కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సందర్భంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. జిల్లాలోని భద్రాచలం పుష్కర క్షేత్రం వద్ద భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. ఎండోమెంట్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఆధ్వర్యంలో పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. అదేవిధంగా జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన పర్ణశాల, మోతే పట్టి నగర్ పుష్కర ఘాట్ ఏర్పాటు కోసం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు.

పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు వీ.ఐ.పీలు, వీ.వీ.ఐ.పీలు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున వాహనాల పార్కింగ్, సరైన రోడ్డు వసతి, అత్యవసర ఎగ్జిట్ వంటి అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పుష్కర ఘాట్ల వరకు అప్రోచ్ రోడ్లు, ఘాట్ల మరమ్మతులు వంటి పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News