Kothagudem: వర్షాభావం: ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి -కలెక్టర్ అంకిత్
Kothagudem: వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరి తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని, తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
Kothagudem: వర్షాభావం: ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి -కలెక్టర్ అంకిత్
కొత్తగూడెం: వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వరి సాగును తగ్గించి తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించాలని, తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిర్వహించిన నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశంలో జిల్లాలోని నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షపాతం పరిస్థితి, పంటల సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, రాబోయే రోజుల్లో నీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. తాగునీటి అవసరాలకు భంగం కలగకుండా సాగునీటి వినియోగంలో శాఖల మధ్య సమన్వయం పాటించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో మొత్తం 2,384 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, 598 చెరువులు 0–25 శాతం, 965 చెరువులు 25–50 శాతం, 587 చెరువులు 50–75 శాతం, 207 చెరువులు 75–100 శాతం నీటితో నిండాయి. మరో 27 చెరువులు పూర్తి స్థాయిలో నిండి మిగులు నీటితో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 209 చెరువులకు గాను 13 చెరువులు 0–25 శాతం, 129 చెరువులు 25–50 శాతం, 72 చెరువులు 50–75 శాతం, 6 చెరువులు 75–100 శాతం నీటితో నిండగా, 2 చెరువులు పూర్తి స్థాయిలో నిండి మిగులు నీటితో ఉన్నాయి. *అశ్వారావుపేట నియోజకవర్గంలో 759 చెరువులకు గాను 271 చెరువులు 0–25 శాతం, 273 చెరువులు 25–50 శాతం, 76 చెరువులు 50–75 శాతం, 66 చెరువులు 75–100 శాతం నీటితో నిండగా, 23 చెరువులు పూర్తి స్థాయిలో నిండి మిగులు నీటితో ఉన్నాయి.
ఇల్లందు నియోజకవర్గంలో 241 చెరువులకు గాను 132 చెరువులు 0–25 శాతం, 96 చెరువులు 25–50 శాతం, 7 చెరువులు 50–75 శాతం, ఒక చెరువు 75–100 శాతం నీటితో నిండగా, 5 చెరువులు పూర్తి స్థాయిలో నిండి మిగులు నీటితో ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలో 802 చెరువులకు గాను 94 చెరువులు 0–25 శాతం, 315 చెరువులు 25–50 శాతం, 313 చెరువులు 50–75 శాతం, 79 చెరువులు 75–100 శాతం నీటితో నిండగా, ఒక చెరువు పూర్తి స్థాయిలో నిండి మిగులు నీటితో ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో 349 చెరువులకు గాను 26 చెరువులు 0–25 శాతం, 150 చెరువులు 25–50 శాతం, 124 చెరువులు 50–75 శాతం, 49 చెరువులు 75–100 శాతం నీటితో నిండాయి.
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలిస్తే తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.68 మీటర్ల నీటిమట్టంతో 669 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు ఆయకట్టు 24,700 ఎకరాలు కాగా స్పిల్‌వే ద్వారా నీరు బయటకు వెళ్తోంది. పెద్దవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 81.235 మీటర్లు కాగా, ప్రస్తుతం 75.235 మీటర్ల వద్ద 90.427 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ ఉంది. దీని ఆయకట్టు 2,360 ఎకరాలు. కిన్నెరసాని ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 124.08 మీటర్లు కాగా, ప్రస్తుతం 122.46 మీటర్ల నీటిమట్టంతో 6,950 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ ఉంది. దీని ఆయకట్టు 10,000 ఎకరాలు.
జిల్లాలో 455.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 561.4 మి.మీ.తో పోలిస్తే 18.8 శాతం లోటు నమోదైంది. జూన్‌లో 4.3 శాతం, జూలైలో 31.8 శాతం లోటు నమోదవగా, ఆగస్టులో ఇప్పటివరకు సాధారణం కంటే 1.2 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలో పంటల సాగు ప్రణాళికను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సీజనల్ యాక్షన్ ప్లాన్‌లోని 4,86,048 ఎకరాల లక్ష్యానికి గాను 4,21,367 ఎకరాల్లో సాగు పూర్తై 86.69 శాతం సాధన నమోదైంది. ఇందులో పత్తి లక్ష్యం 2,19,000 ఎకరాలు కాగా 2,19,000 ఎకరాల్లో సాగై 100 శాతం సాధించింది. వరి లక్ష్యం 31,500 ఎకరాలు కాగా 70,652 ఎకరాల్లో సాగై 224.29 శాతం నమోదైంది. మొక్కజొన్న లక్ష్యం 1,08,500 ఎకరాలు కాగా 75,775 ఎకరాల్లో 69.84 శాతం, పెసర లక్ష్యం 12,500 ఎకరాలు కాగా 6,620 ఎకరాల్లో 52.96 శాతం, కంది లక్ష్యం 22,530 ఎకరాలు కాగా 2,916.23 ఎకరాల్లో 12.94 శాతం, మినుము లక్ష్యం 12,100 ఎకరాలు కాగా 324 ఎకరాల్లో 2.68 శాతం సాగైంది.
జొన్న 2,000 ఎకరాల లక్ష్యానికి ఇప్పటివరకు సాగు నమోదు కాలేదు. ఆయిల్‌పామ్ లక్ష్యం 14,500 ఎకరాలు కాగా 3,516 ఎకరాల్లో 24.25 శాతం, సూర్యకాంతి లక్ష్యం 200 ఎకరాలు కాగా ఇప్పటివరకు సాగు లేదు. కూరగాయల లక్ష్యం 3,000 ఎకరాలు కాగా 680 ఎకరాల్లో 22.67 శాతం, ఇతర పంటల లక్ష్యం 60,218 ఎకరాలు కాగా 41,884 ఎకరాల్లో 69.55 శాతం సాగు నమోదైంది.
వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలో పంటల సాగు విధానంలో అవసరమైన మార్పులు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. అధిక నీటి వినియోగం అవసరమయ్యే వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గిస్తూ, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెసర, మినుము, కంది, కూరగాయలు, ఆయిల్‌పామ్ వంటి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ , వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. వరి సాగును తగ్గించి తక్కువ నీటి వినియోగం అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్‌పామ్, కూరగాయలు, పెసర, మినుము, కంది వంటి పంటలను ప్రాంతానుసారం సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ నీటి వినియోగం, పంటల వైవిధ్యీకరణ, వర్షాభావ పరిస్థితుల్లో పంటలను కాపాడుకునే విధానాలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇంటింటికీ వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలోని ప్రతి రైతుకు ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రాధాన్యతను వివరించి, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని తెలిపారు.
చెరువులు,బోర్‌వెల్స్‌పై అధికంగా ఆధారపడి వరి సాగు చేయడాన్ని నిరుత్సాహపరుస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. రైజ్డ్ బెడ్ విధానం, నీటి సంరక్షణ, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, నేలలో తేమను సంరక్షించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
జిల్లాలో 1,38,198 ఎకరాలను ప్రత్యామ్నాయ పంటల పరిధిలోకి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అన్ని క్లస్టర్లలో పెసర, మినుము, కంది వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీ విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు వివరించారు. సాగునీటి ఆధారిత మొక్కజొన్న, పత్తి, వరి ప్రాంతాల్లో పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఆయిల్‌పామ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
చెరువులు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షపాతం, తాగునీటి లభ్యత, పంటల సాగు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, నీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచి పంట నష్టాల ప్రమాదాన్ని తగ్గించాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత, సాగునీటి వినియోగంలో సమర్థత, పంటల వైవిధ్యీకరణతో రైతుల ఆదాయ పరిరక్షణ లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశం లో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్, సిపిఓ సునీత, మిషన్ భగీరథ ఈఈ లు నలిని, తిరుమలేష్, నీటిపారుదల శాఖ ఈ ఈ లు,డీఈలు వ్యవసాయ శాఖ ఏడీలు,ఏవోలు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.