Khammam: బిగ్ బ్రేకింగ్ hmtv కథనానికి సీఎం రేవంత్ రెడ్డి సంచలన స్పందన!
Khammam: ఖమ్మం జిల్లా గోపాలపురం ప్రాథమిక పాఠశాల దుస్థితిపై hmtv కథనానికి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు.
Khammam: బిగ్ బ్రేకింగ్ hmtv కథనానికి సీఎం రేవంత్ రెడ్డి సంచలన స్పందన!
ఖమ్మం: తిరుమలాయపాలెం మండలం గోపాలపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితిపై వచ్చిన Hmtv కథనానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించాలని ఆదేశించారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోపాలపురం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పాఠశాల భవనం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ గోపాలపురం ప్రాథమిక పాఠశాల భవనం కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో గతంలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం క్రింద ఎంపిక చేసి అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టలేదని తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రధానోపాధ్యాయురాలు నిమ్మతోట ఇందిరా తన సొంత నిధులు రూ.40 వేల వ్యయంతో తాత్కాలిక షెడ్ నిర్మించి తరగతులు నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. విద్యార్థుల పట్ల ఆమె చూపిన బాధ్యత, అంకితభావాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాలను సందర్శించిన సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు నిమ్మతోట ఇందిరాను జిల్లా కలెక్టర్ శాలువాతో సన్మానించి అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయుల సేవా దృక్పథం ఆదర్శప్రాయమని ప్రశంసించారు. గోపాలపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రూ.30 లక్షలు మంజూరు చేశారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు అవసరమైన అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు.
పాఠశాల పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నందున నాణ్యతతో, వేగవంతంగా పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.