Bhadradri Kothagudem: అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. విద్యుత్ కార్మికుల సమ్మె ఉధృతం!
Bhadradri Kothagudem: విద్యుత్ కార్మికుల సమ్మెలో భారీ ట్విస్ట్! 20 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగుల పోరాటానికి మద్దతుగా వస్తున్న వారిని పోలీసులు నిర్బంధించారు.
Bhadradri Kothagudem: అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. విద్యుత్ కార్మికుల సమ్మె ఉధృతం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమాన పనికి సమానమేతనం ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుండి 20,000 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కె.టి.పి.ఎస్ పాల్వంచలో సమ్మె చేస్తున్న కార్మికులను 24 గంటల్లో సమ్మెను విరమించి విధుల్లో చేరకపోతే విధుల నుండి పూర్తిగా బహిష్కరిస్తామని సి&ఎండి హెచ్చరించడంతో కె.టి. పి.ఎస్ కార్మికులకు మద్దతుగా పలు జిల్లాల నుండి ఆర్టిజన్స్ విద్యుత్ ఉద్యోగులు బయలుదేరి వెళుతుండగా జూలూరుపాడు వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్ ను తీసుకువచ్చి 20,000 మంది కార్మికులను అన్యాయం చేయడం జరిగిందన్నారు.
ఒకే సంస్థలు ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు రెండు రూల్స్ ఎందుకని రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే APSEB రూల్స్ ను అందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 20000 మంది కార్మికులు ఈనెల 8వ తేదీ నుండి సమ్మెలో పాల్గొనడం జరుగుతుందన్నారు.
ఈ నేపథ్యంలో పాల్వంచ కె.టి.పి.ఎస్ సి&ఎండి సమ్మె చేస్తున్న కార్మికులను 24 గంటల్లో విధుల్లో చేరకపోతే విధుల నుండి పూర్తిగా బహిష్కరిస్తామని బెదిరింపులకు పాల్పడుతుండటంతో కె.టీ.పి.ఎస్ కార్మికులకు మద్దతుగా పలు జిల్లాల నుండి ఆర్టిజన్ కార్మికులు బయలుదేరడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ తో పాటు పలు జిల్లాలకు చెందిన తమను జూలూరుపాడు వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ తరలించడం జరిగిందన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, సమ్మె చేస్తున్న తమ కార్మికులను బెదిరింపులకు పాల్పడితే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.