Khammam: అన్నదాతను ఆదుకోకుంటే ఉద్యమిస్తాం: మొక్కజొన్న రైతుల పక్షాన బీజేపీ గళం
Khammam: ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
Khammam: అన్నదాతను ఆదుకోకుంటే ఉద్యమిస్తాం: మొక్కజొన్న రైతుల పక్షాన బీజేపీ గళం
ఖమ్మం: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు రోడ్లపై పడిగాపులు కాస్తుంటే, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ముఖ్యంగా కొనిజర్ల , వైరా మండలాల్లో రైతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన స్పందిస్తూ, ప్రభుత్వం తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ సేకరించాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి పెరిగి, దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చినా, మార్కెట్‌లో సరైన మద్దతు ధర లేక రైతులు కుమిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర కేవలం రూ. 1700 నుండి 1800 వరకు మాత్రమే పలుకుతోందని, ఇది రైతులకు కనీస పెట్టుబడి కూడా రాని పరిస్థితిని కల్పిస్తోందని కోటేశ్వరరావు పేర్కొన్నారు. రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువస్తే, మార్క్‌ఫెడ్ అధికారులు ఫంగస్ మరియు సన్నాల పేరుతో కొర్రీలు పెడుతూ కొనుగోళ్లు నిలిపివేయడం దారుణమని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలిస్తే నాణ్యత బాగానే ఉన్నప్పటికీ, అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మార్కెట్ చైర్మన్ స్వయంగా జోక్యం చేసుకుని, నాణ్యత పరీక్షల పేరుతో రైతులను వేధించకుండా చూడాలని ఆయన కోరారు.
మరోవైపు ప్రకృతి ప్రకోపం రైతును మరింత ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా కల్లాల్లో ఉన్న మక్కలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో జాప్యం జరగడంతో, రైతులు తమ పంటను కాపాడుకోలేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని కోటేశ్వరరావు వివరించారు. వర్షానికి తడిసి రంగు మారిన గింజలను దళారులు అసలు కొనరని, ఒకవేళ కొన్నా కారుచౌకగా అడుగుతున్నారని, ఈ పరిస్థితుల్లో రైతుకు ఆత్మహత్యలే శరణ్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ వ్యవహారంపై స్పందించి మార్క్‌ఫెడ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెల్లూరు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి, తడిసిన పంటను సైతం మద్దతు ధరకే కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మందడపు సుబ్బారావు, బండారు నరేష్, కావిడ మురళీకృష్ణ, యాస సత్యనారాయణ, కవిడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.