Unsafe Food Deaths: షాకింగ్ రిపోర్ట్ః ఏటా 15 లక్షలమందిని చంపేస్తున్న ఫుడ్.. ఈ కెమికల్ మీ ప్లేట్లోకి చేరిందా?
ప్రతి ఏడాది అసురక్షిత ఆహారం వల్ల 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆర్సెనిక్, సీసం వంటి ప్రమాదకర రసాయనాలు మీ ఆహారంలో ఉన్నాయా? నివేదికలో వెల్లడైన షాకింగ్ నిజాలు తెలుసుకోండి.
Unsafe Food Deaths: మనం రోజువారీ తినే ఆహారమే మన ప్రాణాల మీదకు తెస్తోంది. కలుషితమైన తిండి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏకంగా 15 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో హెచ్చరించింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారని వెల్లడించింది. ఇది ఏదో సుదూర దేశాల సమస్య కాదు, ప్రతి ఒక్కరి వంటగదిని, ప్రతి కుటుంబం ఆరోగ్య భద్రతను ప్రశ్నిస్తున్న పచ్చి నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ 194 దేశాలలో 2000 నుండి 2021 వరకు సేకరించిన డేటాను విశ్లేషించి ఈ షాకింగ్ గణాంకాలను బయటపెట్టింది. దీని ప్రకారం, ఏటా సుమారు 88 కోట్ల 60 లక్షల మంది కలుషిత ఆహారం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ గణాంకాలను చూస్తే ఎక్కడ మనం ఈ కెమికల్స్‌కి బలౌతామోననే ఆందోళన కలగకుండా ఉండదు. కాబట్టి తినే ఆహారంపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దృష్టిసారించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్లేట్లలోకి చేరుతున్న నిశ్శబ్ద విషం ... ఆర్సెనిక్, సీసం
మనం తీసుకునే ఆహారం కలుషితం కావడానికి రెండు రకాలైన కారణాలు ఉన్నాయి. ఒకటి కంటికి కనిపించని క్రిములు కాగా రెండోది మనం వాడే రసాయనాలు. బ్యాక్టీరియా వైరస్ వంటి బయోలాజికల్ కారకాల వలన ప్రతి ఏడాది సుమారు ప్రపంచవ్యాప్తంగా 86 కోట్ల మంది జబ్బునపడుతున్నారు. ఈ క్రిముల కారణంగా విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇక రెండోది రసాయన మహ్మారి. బ్యాక్టీరియా, వైరస్‌లకంటే ఈ కెమికల్స్ ప్రాణాలు తీస్తున్నాయి. పండించే పంటల్లో విచ్చలవిడిగా వాడుతున్న పురుగుమందులు, భూగర్భజలాల కాలుష్యం వలన ఆర్సెనిక్, సీసం వంటి ప్రాణాంతకరమైన భారీ లోహాలు మనం తినే ఆహారంలోకి చేరుతున్నాయి. వీటిద్వారానే ప్రతి ఏడాది 15 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
క్లైమేట్ చేంజ్ శాపం.. వందల బిలియన్ల నష్టం
ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. వేడి పెరగడం వల్ల ఆహార పదార్థాలలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతోంది. మరోవైపు యాంటీబయాటిక్స్ వాడకం మితిమీరడం వల్ల, కలుషిత ఆహారం తిని వచ్చే ఇన్ఫెక్షన్లకు మందులు కూడా లొంగడం లేదు. ఈ కాలుష్యభరితమైన ఆహారం ప్రాణాలను తీయడమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూలుస్తున్నది. ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోవడం వలన 2021లో సుమారు 647 కోట్ల బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఇందులో ఆఫ్రియా, ఆగ్నేయాసియా దేశాలే అత్యధికంగా 60 శాతం మరణాల భారాన్ని మోస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆహార భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయకపోతే, రాబోయే రోజుల్లో ప్రతి ముద్ద ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. పండించే పంట నుండి వడ్డించే ప్లేటు వరకు ప్రతి దశలోనూ పరిశుభ్రత, ఆర్గానిక్ పద్ధతులు పాటించడం ఒక్కటే దీనికి ఏకైక పరిష్కారం.