Russia Ukraine War:వేట మొదలుపెట్టిన రష్యా... ఉక్రెయిన్ దిగొచ్చేవరకు దాడులు తప్పవని హెచ్చరిక
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా మెరుపుదాడులు చేసింది. క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో కీవ్ మొత్తం అంథకారంలోకి వెళ్లిపోయింది. ఉక్రెయిన్ దిగొచ్చేవరకు దాడులు తప్పవని రష్యా హెచ్చరించింది.
Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సరికొత్త, అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఉక్రెయిన్ దారిలోకి వచ్చి, లొంగిపోయేంత వరకు దాడులు ఆపేది లేదంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సేనలు ఉక్రెయిన్‌పై మునుపెన్నడూ లేనంత ఘోరమైన వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్, ద్నిప్రో నగరాలపై రష్యా జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడుల్లో కనీసం 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ద్నిప్రోలో ఆరుగురు, కీవ్‌లో నలుగురు మరణించగా, పలువురు పిల్లలతో సహా డజన్ల కొద్దీ జనం తీవ్రంగా గాయపడ్డారు. కీవ్ నగరమంతా దట్టమైన నల్లటి పొగలతో, బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది.
దాడుల వెనుక అసలు వ్యూహం ... 'ఒరెష్నిక్' హెచ్చరిక
గత నాలుగేళ్లుగా రష్యా కొంతవరకు సాంప్రదాయ పద్ధతిలోనే యుద్ధం చేస్తూ వచ్చింది. అయితే, ఇటీవల రష్యా ఆధీనంలో ఉన్న లుహాన్స్క్ ప్రాంతంలోని స్టారోబిల్స్క్‌లో గల ఒక మిలిటరీ వసతి గృహంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో 21 మంది రష్యా సైనికులు మరణించారు. అలాగే రష్యాలోని క్రాస్నోడార్ క్రై ప్రాంతంలో ఉన్న ఇల్స్కీ చమురు శుద్ధి కర్మాగారంపై కూడా ఉక్రెయిన్ మెరుపు దాడులు చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రష్యా, గంటకు ఏకంగా 12,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, హైపర్‌సోనిక్ 'ఒరెష్నిక్' క్షిపణిని రంగానికి దించింది. ఈ క్షిపణిని అడ్డుకోవడం ప్రస్తుతానికి ఏ నాటో దేశాల రక్షణ వ్యవస్థల తరం కూడా కాదు. ఉక్రెయిన్‌కు వత్తాసు పలుకుతున్న నాటో దేశాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని మాస్కో నేరుగా హెచ్చరించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
చీకట్లోకి రాజధాని కీవ్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమీర్ జెలెన్స్కీ ముందుగానే హెచ్చరించినట్లుగానే, రష్యా బాలిస్టిక్ క్షిపణులతో కీవ్‌పై విరుచుకుపడింది. కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో తెలిపిన వివరాల ప్రకారం.. దాడుల ధాటికి బహుళ అంతస్తుల నివాస భవనాలు, గ్యాస్ స్టేషన్లు, పారిశ్రామిక ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కూలిపోయిన భవనాల శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయారు. విద్యుత్ గ్రిడ్‌లను లక్ష్యంగా చేసుకోవడంతో కీవ్ సహా జాపోరిజ్జియా నగరాలు పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయాయి. రష్యా భీకర దాడులు మొదలుపెట్టడంతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. రాజకీయ పంతాలకు పోవడం వలన సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. యుద్ధం భయం ఒకవైపైతే...మరోవైపు ఆహారం, సదుపాయాలు దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
రష్యా చేస్తున్న ఈ దాడులు కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఉక్రెయిన్ మిత్రదేశాలైన ఐరోపా, అమెరికాలను భయపెట్టే ఒక వ్యూహాత్మక బ్లాక్‌మెయిల్ అని కీవ్ విమర్శిస్తోంది. అయితే, ఉక్రెయిన్ పూర్తిగా మోకరిల్లే వరకు ఈ "సిస్టమాటిక్ దాడులు" ఆపబోమని రష్యా స్పష్టం చేయడంతో, ఐరోపా దేశాలు తీవ్ర అప్రమత్తత ప్రకటించాయి. ఈ పరిణామాలు ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నెడుతున్నాయా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలానే కొనసాగితే పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఆర్థికంగా రెండు దేశాలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా ప్రపంచదేశాలు స్పందించి ఈ యుద్ధానికి తెరపలికితే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.