Iran: ఇరాన్ రాజకీయాల్లో పెను భూకంపం: అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా?
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఐఆర్‌జీసీ (IRGC) దళాల తీరుపై అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Iran: ఇరాన్ రాజకీయాల్లో పెను భూకంపం: అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ రాజీనామా?
Iran: ఇరాన్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ తన పదవికి రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాల మితిమీరిన జోక్యం, వారి పనితీరుపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెజష్కియన్ తన రాజీనామా లేఖను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు అమెరికా కేంద్రంగా పనిచేసే ఒక ప్రముఖ ఇరాన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
సదరు పత్రిక కథనం ప్రకారం.. ఇరాన్ పాలన క్రమంగా ఎన్నికైన ప్రభుత్వం చేతుల్లోంచి పూర్తిగా ఐఆర్‌జీసీ (IRGC) కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతోందని పెజష్కియన్ తన రాజీనామా లేఖలో హెచ్చరించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాల విషయంలో ఇరాన్ ప్రభుత్వ అధికారులను, సివిల్ యంత్రాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా తనకు ఉన్న బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహించకుండా అడ్డుపడుతున్నారని పెజష్కియన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.
ఈ అంతర్జాతీయ కథనాలపై ఇరాన్ అధ్యక్ష కార్యాలయం తక్షణమే స్పందించింది. ప్రెసిడెంట్ ఆఫీస్ కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం అమెరికాతో కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో, ఇరాన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ మీడియా తప్పుడు రిపోర్టులతో 'మీడియా గేమ్స్' ఆడుతోందని ఆయన మండిపడ్డారు. తుర్కియే ప్రభుత్వ అధికారిక పత్రిక కూడా ఇరాన్ ఖండనను సమర్థిస్తూ కథనాలను ప్రచురించింది.
మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధమైన శాంతి ఒప్పంద డ్రాఫ్ట్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రేకులు వేశారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనల్లో ట్రంప్ కీలక మార్పులు కోరినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
తాజా డ్రాఫ్ట్‌లోని ముఖ్యాంశాలు & ట్రంప్ అభ్యంతరాలు:
డ్రాఫ్ట్‌లో 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదన ఉంది.
అంతర్జాతీయ వాణిజ్యం కోసం హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
అయితే, కేవలం కాల్పుల విరమణ సరిపోదని.. ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని, అణు కార్యక్రమాలను పూర్తిగా శాశ్వతంగా వదిలివేయాలనే ప్రధాన నిబంధనపై ట్రంప్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి నియంత్రణపై కూడా అమెరికా మరికొన్ని మార్పులను కోరింది.
ఈ పరిణామాలపై స్పందిస్తూ.. "తాము డీల్ చేసుకోవడానికి ఎలాంటి తొందరపాటులో లేము" అని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.
అమెరికా వైఖరిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాటుగా స్పందించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, దేశ హక్కులను కాపాడని ఏ రకమైన శాంతి ఒప్పందానికి (Deal) తాము అంగీకరించబోయే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అధ్యక్షుడు పెజష్కియన్ రాజీనామా రూమర్స్, ట్రంప్ శాంతి ఒప్పంద తిరస్కరణతో పశ్చిమ ఆసియాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.