Donald Trump : తెరపైకి డోనాల్డ్ ట్రంప్ సీక్రెట్ వార్ ప్లాన్.. హోర్ముజ్ జలసంధి వేదికగా ఊహించని వ్యూహం

Donald Trump : ఇరాన్‌తో ఒప్పందం ముసుగులో డోనాల్డ్ ట్రంప్ భారీ సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి.

Update: 2026-05-31 03:01 GMT

Donald Trum

Donald Trump : ప్రపంచ రాజకీయాల్లో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం ఒక భారీ మిలిటరీ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. గత పది రోజులుగా హోర్ముజ్ జలసంధి, ఓమన్ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లో అమెరికా జరుపుతున్న చిన్నపాటి దాడులు, డ్రోన్ల చొరబాట్లు కేవలం ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించడానికేనని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ వ్యూహంతో ఇరాన్ మిసైల్ స్థావరాల గుట్టును రట్టు చేసి, ఒకేసారి కోలుకోలేని దెబ్బకొట్టాలనేది ట్రంప్ మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తోంది.

ఇటీవల జరిగిన యుద్ధ విరామం తర్వాత ఇరాన్ తన సైనిక నెట్‌వర్క్‌ను చాలా వేగంగా పునర్నిర్మించుకుంది. ఇరాన్ రక్షణ వ్యవస్థలన్నీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో యాక్టివ్ అయ్యాయి. అంతేకాకుండా ఇరాన్ తన అత్యంత రహస్యమైన భూగర్భ మిసైల్ స్థావరాల తలుపులను కూడా తెరిచింది. ఇరాన్ నౌకాదళం సైతం సముద్రంలో తన బలాన్ని భారీగా పెంచుకుంది. అంతరిక్షం నుంచి అమెరికా శ్యాటిలైట్లు ఈ కదలికలను నిరంతరం గమనిస్తున్నప్పటికీ, ఇరాన్ సైనిక వ్యూహాలు అత్యంత రహస్యంగా ఉండటం వల్ల ఖచ్చితమైన సమాచారం సేకరించడం వాషింగ్టన్‌కు కష్టంగా మారింది. అందుకే అమెరికా కొత్త పంథాను ఎంచుకుంది.

అమెరికా కావాలనే ఇరాన్ వైమానిక పరిధిలోకి డ్రోన్లను పంపుతూ ఇరాన్ రక్షణ వలయాన్ని రెచ్చగొడుతోంది. ఈ చొరబాట్లను అడ్డుకునేందుకు ఇరాన్ తన రడార్లను, శత్రు విమాన నిరోధక వ్యవస్థలను ఆన్ చేసిన వెంటనే.. వాటి ఖచ్చితమైన లొకేషన్లను అమెరికా శ్యాటిలైట్లు రికార్డ్ చేస్తున్నాయి. ఇరాన్ తన భూగర్భ స్థావరాల నుంచి క్షిపణి లాంచర్లను ఏయే మార్గాల ద్వారా బయటకు తీసుకువస్తుందో తెలుసుకోవడానికి ఈ చిన్నపాటి ఘర్షణలు అమెరికాకు ఒక ల్యాబొరేటరీలా ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ఈ డ్రోన్ల చొరబాట్లన్నీ హోర్ముజ్ జలసంధి సమీపంలోనే జరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో పెద్ద యుద్ధం వస్తే దానికి సముద్ర మార్గమే కేంద్ర బిందువు కానుందని స్పష్టమవుతోంది.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ సిట్యువేషన్ రూమ్‌లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో దాదాపు రెండు గంటల పాటు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇరాన్‌తో చర్చల పురోగతితో పాటు సైనిక చర్యలకు ఉన్న అవకాశాలపై ఈ మీటింగ్‌లో సుదీర్ఘంగా చర్చించారు. ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఇరాన్‌లోని ప్రధాన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాంతాల లొకేషన్లను వీలైనంత త్వరగా సేకరించాలని ట్రంప్ తన సైనిక కమాండర్లను ఆదేశించినట్లు సమాచారం. దీన్ని బట్టి అమెరికా ఒక పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ అమెరికా గనుక ఇరాన్‌పై నేరుగా దాడికి దిగితే, దాని ప్రధాన లక్ష్యం దక్షిణ ఇరాన్ ప్రాంతమేనని నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడిలో అమెరికా మొదటగా ఇరాన్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను, విద్యుత్ సరఫరాను పూర్తిగా దెబ్బతీయాలని చూస్తోంది. అమెరికాకు ఉన్న అత్యాధునిక శ్యాటిలైట్లు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ద్వారా ఇరాన్ అంతర్గత సైనిక సమాచార వ్యవస్థను జామ్ చేస్తారు. దీనివల్ల స్థానిక కమాండర్లకు కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు అందవు. అదే సమయంలో సైబర్ దాడుల ద్వారా పవర్ గ్రిడ్‌లను ధ్వంసం చేసి రడార్లు, రక్షణ వ్యవస్థలు పనిచేయకుండా చేయడమే అమెరికా అసలు ప్లాన్.

ఈ వ్యూహంలో భాగంగా అమెరికా మొదట నకిలీ లేదా శత్రువును పక్కదారి పట్టించే డెకాయ్ ఫైటర్ జెట్లను ఇరాన్ సరిహద్దుల్లోకి పంపుతుంది. ఇరాన్ వాటిని నిజమైన యుద్ధ విమానాలుగా భావించి ఫైరింగ్ ప్రారంభించగానే, వాటి అసలు స్థావరాలు బయటపడతాయి. ఆ వెంటనే అమెరికా అసలైన యుద్ధ విమానాలు రంగంలోకి దిగి ఆ స్థావరాలను నాశనం చేస్తాయి. ఈ ఆపరేషన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌లతో పాటు బ్రిటన్ కూడా చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హోర్ముజ్ ప్రాంతంలో అమెరికా, బ్రిటన్ నౌకాదళాలు సంయుక్తంగా అప్రమత్తత ప్రకటన విడుదల చేశాయి. వీటికి తోడు అమెరికాకు చెందిన భారీ యుద్ధనౌక యూఎస్ఎస్ బుష్ అర్ధరాత్రి వేళల్లో హోర్ముజ్ సముద్ర తీరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ ఇరాన్‌కు ముచ్చెమటలు పట్టిస్తోంది.

Tags:    

Similar News