North Korea AI Missiles: నార్త్‌ కొరియాలో ఏఐ క్షిపణులు... సరికొత్త సాంకేతికతను హస్తగతం చేసుకున్న కిమ్‌

ఏఐ ఆధారిత క్షిపణులను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

Update: 2026-05-28 09:24 GMT

North Korea AI Missiles: అందరిది ఒకదారైతే...నార్త్‌ కొరియాది మరోదారి. ప్రపంచంతో సంబంధం లేకుండా తనకు నచ్చిందే చేస్తుంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే హెచ్చరికలను అస్సలు పట్టించుకోదు. తమకు తమదేశ రక్షణే ముఖ్యమని నిత్యం క్షిపణులను పరీక్షిస్తూ...సరికొత్త ఆయుధాలు తయారు చేస్తూ వార్తల్లో ఉంటుంది. కాగా, ఇప్పుడు మరింత ప్రమాదకరమైన సరికత్త సాంకేతికతను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సొంతం చేసుకున్నారు. ఉత్తర కొరియా చరిత్రలో తొలిసారిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో పనిచేసే అత్యాధునిక గైడెడ్‌ క్షిపణులను నార్త్‌ కొరియా విజయవంతంగా ప్రయోగించి ప్రపంచానికి షాకిచ్చింది. గతంలో కంటే ఇప్పుడు లక్ష్యాలను ఖచ్చితత్వంతో దాడిచేయగల సామర్థ్యం ఉత్తర కొరియా సొంతమైనట్టు ఆ దేశ అధికారిక వార్తాసంస్థ కేసీఎన్‌ఏ స్పష్టం చేసింది. ఇప్పటికే అమెరికాకు కొరకరాని కొయ్యగా, పక్కలో బల్లెంగా తయారైన కిమ్‌...ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడంతో మరింత ప్రమాదకరంగా మారాడు. తమ అధ్యక్షుడికి ప్రమాదం పొంచిఉన్నా...లేదా ఏదైనా దేశం జరిపిన దాడిలో అధ్యక్షుడికి ప్రమాదం చోటు చేసుకున్నా... ఆటోమేటిక్‌గా అణ్వాయుధాలు ఆయా దేశాలపై దాడి చేసే విధంగా రాజ్యాంగాన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి వరకు దీనిని అమల్లోకి తీసుకురానున్నారు. ఇది అమలు జరిగితే ఉత్తర కొరియా జోలికి వెళ్లడం మరింత కష్టమౌతుంది.

ఎలా పనిచేస్తుంది ఈ ఏఐ టెక్నాలజీ?

సాధారణంగా క్షిపణులను భూమి లేదా శాటిలైట్స్‌ ద్వారా కంట్రోల్‌ చేస్తారు. కానీ, ఈ సరికొత్త ఏఐ ఆధారిత గైడెడ్‌ ట్యాక్టికల్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లు శతృవుల స్థావరాలను శాటిలైట్స్‌తో పనిలేకుండా వాటి సొంతంగా గుర్తిస్తాయి. వాటి లక్ష్యాన్ని స్వయంగా నిర్దేశించుకొని, ప్రయాణిస్తున్న సమయంలోనే ఎదురయ్యే అడ్డంకులను గుర్తించి, శతృవుల కదలికలను విశ్లేషించుకొని దారిని మార్చుకుంటూ దాడి చేస్తాయి. దీంతో వీటిని గుర్తించడంతో పాటు అడ్డుకోవడం కూడా కష్టమౌతుంది. ప్రస్తుతం 100 కిలోమీటర్ల రేంజ్‌లో ఉండే లక్ష్యాలను ధ్వంసం చేయగల ఏఐ గైడెడ్‌ మిస్సైల్స్‌ను తయారు చేశారు. ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో నార్త్‌ కొరియా శతృదేశాలైన దక్షిణకొరియా, జపాన్‌ దేశాలో ఆందోళన చెందుతున్నాయి.

దక్షిణ కొరియా, అమెరికా దేశాల్లో గుబులు

ఈ ప్రయోగం జరిగిన సమయంలోనే దక్షిణ కొరియా అధ్యక్షుడు అణుశక్తితో నడిచే సబ్‌మెరైన్ల కొనుగోలుపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కిమ్ ఈ పరీక్షలు జరపడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. నార్త్ కొరియా ప్రయోగించిన ఈ క్షిపణులు దాదాపు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పశ్చిమ సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా సైన్యం గుర్తించింది. మరోవైపు, ఇలాంటి అధునాతన ఏఐ సాంకేతికతను ఇప్పటికే అమెరికా సైన్యం ఇరాన్ వంటి దేశాలతో జరుగుతున్న ఘర్షణల్లో ఉపయోగిస్తోందని అమెరికా సెంట్‌కామ్ చీఫ్ బ్రాడ్ కూపర్ ఇటీవల పేర్కొన్నారు. ఎప్పుడు షూట్ చేయాలి, దేనిపై దాడి చేయాలి అనే తుది నిర్ణయం ఎప్పుడూ మనుషుల చేతుల్లోనే ఉంటుంది. కానీ, గతంలో గంటలు లేదా రోజులు పట్టే విశ్లేషణలను ఈ ఏఐ టూల్స్ కేవలం సెకన్ల వ్యవధిలోనే పూర్తి చేసి కమాండర్లకు అందిస్తాయి. అని కూపర్ వివరించారు. దీనికి అనుగణంగా కమాండర్లు నిర్ణయం తీసుకొని టార్గట్లను ధ్వంసం చేస్తారు.

అమెరికాకే సొంతం అనుకుంటున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు నార్త్‌ కొరియా చెంతకు చేరడంతో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ టెక్నాలజీని ఉపయోగించి అమెరికాపై ఎప్పుడు గురిపెడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక నార్త్‌కొరియాకు మిత్రపక్షాలుగా ఉన్న చైనా, రష్యాలు కూడా ఈ టెక్నాలజీని కలిగి ఉండటం ఆ దేశానికి కలిసి వచ్చింది. ఈ మూడు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండటం, నార్త్‌ కొరియాలో ఈ దేశాల అధ్యక్షులు తరచుగా పర్యటిస్తుండటంతో పాటు, రష్యాకు నార్త్‌కొరియా సైనిక సహకారం కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా ఈ టెక్నాలజీని సొంతం చేసుకుందని నిపుణులు చెబుతున్నారు.  

Tags:    

Similar News