Donald Trump : అణు చర్చలకు రండి.. లేదంటే బాంబులే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Donald Trump : మధ్యప్రాచ్యంలో మళ్ళీ యుద్ధం రాజుకుంటుంది. ఇరాన్ పెట్టిన ప్రతిపాదనను డోనాల్డ్ ట్రంప్ తిరస్కరించాడు. హోర్ముజ్ దిగ్బంధం కొనసాగుతుందని ప్రకటించాడు.

Update: 2026-04-30 02:30 GMT

Donald Trump 

Donald Trump : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఇరాన్ గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్టు చేసింది. ఇరాన్ పెట్టిన రాయబారాన్ని ట్రంప్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 'ముందు మాపై ఉన్న ఆంక్షలు తొలగించండి, హోర్ముజ్ జలసంధిని తెరవండి.. ఆ తర్వాతే అణు చర్చల సంగతి చూద్దాం' అన్న ఇరాన్ ప్రతిపాదనకు ట్రంప్ ససేమిరా అన్నారు. ఇరాన్ పూర్తిగా తన అణు కార్యక్రమాలను పక్కన పెట్టి, అమెరికా చెప్పినట్లు వినే వరకు ఈ నౌకాదళ దిగ్బంధం అంగుళం కూడా కదలదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ తన వ్యూహాన్ని బయటపెట్టారు. ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధం బాంబు దాడుల కంటే శక్తివంతంగా పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆంక్షల వల్ల ఇరాన్ తన ముడి చమురును ఎగుమతి చేయలేక నానా అవస్థలు పడుతోందని, అక్కడి చమురు నిల్వలు, పైపులైన్లు ఒత్తిడి తట్టుకోలేక పేలిపోయే స్థితికి వచ్చాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చర్చల కోసం వస్తోంది అంటేనే అర్థం.. వారు అమెరికా దెబ్బకు తలవంచుతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉండటాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ అణు చర్చలను వాయిదా వేసి, కేవలం తన ఆర్థిక ప్రయోజనాల కోసం దిగ్బంధాన్ని ఎత్తివేయాలని కోరుతోందని, కానీ తాను ఆ ట్రాప్‌లో పడనని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను సైనిక చర్య కంటే ఆర్థిక, నౌకాదళ దిగ్బంధం ద్వారానే ఇరాన్‌ను దారికి తెచ్చుకోవాలని చూస్తున్నానని, ఒకవేళ ఇరాన్ మొండికేస్తే మాత్రం శక్తివంతమైన దాడులకు వెనుకాడబోమని హెచ్చరించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే ఇరాన్ పై దాడులు చేయడానికి పక్కా ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు చేయాలని అమెరికా భావిస్తోంది. చర్చల టేబుల్ వద్ద ఇరాన్ తన పంతాన్ని వీడకపోతే, ఈ మిలటరీ ప్లాన్‌ను అమలులోకి తెచ్చే అవకాశం ఉంది. వాషింగ్టన్ తన పట్టును మరింత బిగించడం ద్వారా ఇరాన్ ను పూర్తిగా లొంగదీసుకోవాలని చూస్తోంది.

అమెరికా ధోరణిపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది. తాము ఇప్పటివరకు ఓపిక పట్టామని, కానీ అమెరికా దిగ్బంధం కొనసాగితే ఊరుకోబోమని ఇరాన్ భద్రతా దళాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా నౌకాదళ చర్యలకు అతి త్వరలోనే ఊహించని రీతిలో సమాధానం ఇస్తామని, తమ సహనానికి కూడా పరిమితులు ఉంటాయని ఇరాన్ ఘాటుగా చెబుతోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఆడియో సందేశం ద్వారా అమెరికా కుయుక్తులను చిత్తు చేస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మధ్యప్రాచ్యంలో మరోసారి భీకర యుద్ధం మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News