UAE Oil Benefit India: యూఏఈతో బలమైన బంధం...భారత్‌కు కలిసివస్తుందా?

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ చమురు రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దశాబ్ధకాలంగా ఒపెక్‌ కూటమిలో కీలక దేశంగా వ్యవహరించిన యూఏఈ తాజా పరిణామాల దృష్ట్యా ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసింది.

Update: 2026-04-29 07:02 GMT

UAE Oil Benefit India: ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన విరివిగా ఉండాలి. ఒకప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా ప్రయాణం చేయగలిగినపుడే అభివృద్ధి సాధ్యమౌతుంది. రవాణాకు అత్యంత కీలకం చమురు. కాగా, పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ చమురు రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. దశాబ్ధకాలంగా ఒపెక్‌ కూటమిలో కీలక దేశంగా వ్యవహరించిన యూఏఈ తాజా పరిణామాల దృష్ట్యా ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఇలా రావడం మిగతా దేశాలకు ఇబ్బంది కలిగించినా...భారత్‌కు పెద్ద వరంగా మారబోతున్నది. ఇది కేవలం దౌత్యపరమైన మార్పు మాత్రమే కాదు... సామాన్యుడి జేబుపై కూడా ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఒపెక్ నుంచి యూఏఈ అవుట్.. భారత్‌కు చమురు 'బూస్ట్'!

చమురును ఉత్పత్తి దేశాల కూటమినే ఒపెక్‌. అయితే, ఈ ఒపెక్‌ కూటమి నుంచి యూఏఈ బయటకు వచ్చేసింది. ఇక భారతదేశం విషయానికి వస్తే...చమురు అవసరాల కోసం 85 శాతం దిగుమతిపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నవేళ చమురు సరఫరా భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం భారత ఇంధన భద్రతకు పెద్ద ఊరట అనే చెప్పాలి. యూఏఈతో ఉన్న అనుబంధం చమురు రవాణాకు ఉపయోగపడుతుందని భావిస్తోంది.

ఒపెక్ ఆంక్షల సంకెళ్లు తెంచుకున్న యూఏఈ

ప్రపంచ చమురు ఉత్పత్తిలో దాదాపు 59 శాతం వాటాను నియంత్రించే ఒపెక్ దేశాలు, ధరలను పెంచడం కోసం ఉత్పత్తిని తగ్గించాలని నిబంధనలు విధిస్తుంటాయి. కానీ, యూఏఈ గత కొన్నేళ్లుగా తన చమురు నిల్వలను వెలికితీసేందుకు, రిఫైనరీల కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. చమురు ఉత్పత్తి తగ్గించినపుడు చమురు నిల్వల గిడ్డంగులు ఖాళీగా ఉంటున్నాయి. రిఫైనరీలు ఇబ్బంది పడుతున్నాయి. ఒపెక్‌ నిబంధనల కారణంగా తన పూర్తి సామర్థ్యాన్ని వాడుకోలేకపోతున్న యూఏఈ ఇప్పుడు స్వేచ్చగా చమురును ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది.

భారత్‌కు కలిగే లాభాలు ఇవే

ఇప్పటి వరకు ఒపెక్‌ నిబంధనలను అనుసరించే ఉత్పత్తి ధరలు ఉండేవి. ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా భారత్‌ చమురు సంస్థలపైనే కాకుండా సామాన్యుడిపై కూడా భారం పడుతుండేది. కానీ, ఒపెక్‌ నుంచి యూఏఈ బయటకు రావడంతో నేరుగా ఆ దేశంతోనే చమురు విషయంలో బేరసారాలు చేసుకోవచ్చు. తక్కువ ధరకు ముడిచమురును కొనుగోలు చేయవచ్చు. యూఏఈ నుంచి నేరుగా తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేయడం వలన ధరలు తగ్గుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దీని వలన దేశీయంగా సామాన్యుడికి ధరల భారం తగ్గుతుంది. చమురు సంస్థలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. వేగంగా అభివృద్ధి చెందడానికి చమురు ధరల నియంత్రణతో వచ్చిన డబ్బును ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు, ఇరాన్‌, రష్యా దేశాలపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అక్కడి నుంచి చమురు రవాణా కష్టంగా మారింది. అయినప్పటికీ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి చమురు భారత్‌కు చేరుకోవడానికి సమయం పడుతుంది. కానీ, యూఏఈ నుంచి భారత్‌కు చమురు రవాణా చాలా సులభం. తక్కువ సమయంలోనే నౌకలు భారత్‌ను చేరుకుంటాయి. అంతేకాదు, యూఏఈ భారత్‌కు బలమైన మిత్రదేశం. భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది భారత్‌కు కలిసివచ్చే అంశం.

మొత్తంగా చెప్పాలంటే యూఏఈ తన సొంతలాభం కోసం ఒపెక్‌ కూటమి నుంచి బయటకు వచ్చినా అది భారత్‌కు పరోక్షంగా పెద్దలాభం అనే చెప్పాలి. యూఏఈ నుంచి సరఫరా పెరగడం వలన అంతర్జాతీయంగా చమురు ధరల్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 1 నుంచి యూఏఈ సొంతంగా చమురును ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మొదటి వారం నుంచే భారత్‌లో చమురు సమస్య ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.  

Tags:    

Similar News