US Iran War : అగ్రరాజ్య రహస్యాలు ఇకచైనా చేతికి? అమెరికా ఆయుధాలపై ఇరాన్ రివర్స్ ఇంజనీరింగ్
US Iran War : ఇరాన్ చేతికి అమెరికా బంకర్ బస్టర్ బాంబులు చిక్కాయి. రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా అమెరికా రక్షణ రహస్యాలను ఇరాన్ చైనాకు చేరవేసే అవకాశం ఉండటంతో అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.
US Iran War
US Iran War : అమెరికా రక్షణ రహస్యాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్‌పై అమెరికా ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు పేలకుండానే ఇరాన్ చేతికి చిక్కడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ బాంబులను ఉపయోగించి ఇరాన్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడమే కాకుండా, తన మిత్రదేశమైన చైనాకు ఈ టెక్నాలజీని అందిస్తే అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది.
ఏమిటీ బంకర్ బస్టర్ బాంబుల కథ?
ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడుల్లో అమెరికా ప్రయోగించిన GBU-57 వంటి అత్యాధునిక బంకర్ బస్టర్ బాంబులు కొన్ని పేలలేదు. ఇవి భూగర్భంలో 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయి లక్ష్యాలను నాశనం చేయగలవు. కానీ ఇప్పుడు ఇవి ఇరాన్ సైన్యానికి దొరకడంతో, అమెరికా శాస్త్రవేత్తలు దశాబ్దాల తరబడి చేసిన పరిశోధనలు ఇప్పుడు శత్రువుల చేతికి వెళ్లినట్లయింది. ఈ బాంబులో ఉండే JDAM గైడెన్స్ కిట్, ధృడమైన స్టీల్ బాడీ మరియు అత్యంత సురక్షితమైన పేలుడు పదార్థం (PBXN-109) టెక్నాలజీని ఇరాన్ ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
రివర్స్ ఇంజనీరింగ్ - ఇరాన్ మాస్టర్ ప్లాన్
ఇరాన్ ఈ బాంబులను విడదీసి రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా అమెరికా ఆయుధాల రహస్యాలను తెలుసుకోనుంది. ఈ బాంబులు ఎంత లోతు వరకు వెళ్లగలవు? ఎలాంటి లోహాలను కోయగలవు? అనేది తెలుసుకుంటే, దానికి తగ్గట్లుగా ఇరాన్ తన అణు కేంద్రాలను భూమి లోపల మరింత బలంగా నిర్మించుకుంటుంది. కాంక్రీట్, ఐరన్ పొరలతో కూడిన అజేయమైన రక్షణ గోడను నిర్మిస్తే, భవిష్యత్తులో అమెరికా బాంబులు వేసినా అణు కేంద్రాలకు చుక్క నష్టం వాటిల్లదు. ఇది అమెరికా సైనిక సామర్థ్యానికే పెద్ద సవాలుగా మారనుంది.
చైనా-ఇరాన్ కూటమి - అమెరికాకు అసలైన ముప్పు
ఇరాన్ తన రక్షణ అవసరాల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. డ్రోన్లు, మిస్సైల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వంటి రంగాల్లో చైనా ఇరాన్‌కు అండగా ఉంటోంది. ఇప్పుడు తనకు దొరికిన అమెరికా బాంబుల బ్లూప్రింట్‌ను ఇరాన్ చైనాకు అప్పగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే, అమెరికా ఆయుధాలను ఎలా ఎదుర్కోవాలో చైనాకు తెలిసిపోతుంది. డ్రాగన్ తన ల్యాబ్‌లో ఆ టెక్నాలజీని విశ్లేషించి అమెరికాను ఢీకొట్టే అజేయ కవచాన్ని తయారు చేసుకుంటుంది.
ట్రంప్ పర్యటనపై నీలినీడలు
రానున్న మే 14, 15 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. చైనా ప్రస్తుతం పైకి శాంతి మంత్రం జపిస్తున్నా, లోపల మాత్రం ఇరాన్ ద్వారా అమెరికా రహస్యాలను సేకరిస్తోందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ విరామం గురించి చర్చిస్తున్నా, ఇరాన్, చైనా ల్యాబ్‌లలో మొదలైన ఈ సరికొత్త రక్షణ పరిశోధనలు ప్రపంచ భవిష్యత్తును మార్చబోతున్నాయి. అమెరికా తన సొంత ఆయుధాల వల్లే ఇప్పుడు ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.