Sea Silk Secret: బంగారం కంటే విలువైన సీ సిల్క్...2వేల సంవత్సరాలనాటి రహస్యాన్ని ఛేదించిన కొరియా శాస్త్రవేత్తలు
బంగారం కంటే విలువైనదిగా పేరుగాంచిన సీ సిల్క్ రహస్యాన్ని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఛేదించారు. 2,000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అరుదైన సముద్ర నూలును ఎలా తయారు చేశారో తెలుసుకుందాం.
Sea Silk Secret: ప్రకృతి ఒడిలో దాగున్న రహస్యాలు ఎప్పుడూ అద్భుతాలే. అలాంటి ఒక పురాతన, అత్యంత విలువైన రహస్యాన్ని కొరియా శాస్త్రవేత్తలు తాజాగా ఛేదించారు. అదే ‘సీ సిల్క్’. ఒకప్పుడు రోమన్ చక్రవర్తులు, పోప్‌లు, ప్రపంచాన్ని ఏలిన మహారాజులు మాత్రమే ధరించిన ఈ పట్టు, బంగారం కంటే విలువైనదిగా చరిత్ర చెబుతోంది. సముద్ర కన్యలు దీనిని నేశారనే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా కనుమరుగైపోయిన ఈ 2,000 సంవత్సరాల నాటి అద్భుతాన్ని, కొరియాలోని పోస్టెక్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాంగ్ సూ హ్వాంగ్, ప్రొఫెసర్ జిమిన్ చోయ్ బృందం ఆధునిక సాంకేతికతతో పునఃసృష్టించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
అసలు ఏంటి ఈ ‘సీ సిల్క్’? ఎలా తయారవుతుంది?
ఇది సాధారణ పట్టుపురుగుల నుండి వచ్చే సిల్క్ కాదు. భూమధ్య రేఖ అంటే మెడిటేరియన్ సముద్ర గర్భంలో ఉండే ‘పిన్నా నోబిలిస్’ అనే పెద్ద నత్త గుల్లలు, సముద్రపు అడుగుభాగానికి అతుక్కుని ఉండటానికి ‘బైసస్’ అనే ఒక రకమైన పీచు పదార్థాన్ని విడుదల చేస్తాయి. పూర్వకాలంలో సముద్ర తీర ప్రాంత కళాకారులు ఆ పీచును సేకరించి, శుద్ధి చేసి, బంగారు రంగులో మెరిసిపోయే దారాలుగా మార్చేవారు. అయితే, ఈ జాతి నత్త గుల్లలు అంతరించిపోవడంతో ఐరోపా సమాఖ్య దీనిపై పూర్తి నిషేధం విధించింది. దీనితో ఈ అరుదైన కళ కాలగర్భంలో కలిసిపోయింది.
కొరియా శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
కొరియా పరిశోధకులు అంతరించిపోతున్న నత్త గుల్లలను ముట్టుకోకుండా, కొరియా తీరాల్లో ఆహారం కోసం విరివిగా పెంచే ‘అట్రినా పెక్టినాటా’ అనే ప్రత్యామ్నాయ నత్త జాతిని ఎంచుకున్నారు. ఇప్పటివరకు సముద్ర వ్యర్థాలుగా పారేస్తున్న వీటి పీచును పరీక్షించగా, అది మెడిటరేనియన్ సీ సిల్క్‌తో శారీరక, రసాయనిక పోలికలను కలిగి ఉన్నట్లు తేలింది. దీని ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా, పర్యావరణహితమైన బంగారు పట్టును తయారుచేశారు శాస్త్రవేత్తలు.
శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన ‘బంగారు రంగు’ రహస్యం
ఈ సీ సిల్క్‌కు ఎలాంటి రసాయన రంగులు వాడకపోయినా శతాబ్దాల తరబడి ఆ బంగారు రంగు ఎలా ఉంటుందా అని పరిశోధించగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. ఈ దారాలలో ఉండే సూక్ష్మమైన ప్రొటీన్ నిర్మాణాలను ‘ఫొటోనిన్’ అంటారు. సీతాకోకచిలుక రెక్కలు, సబ్బు బుడగలపై కాంతి పడినప్పుడు ఎలా రంగులు మారుతాయో, అలాగే ఈ దారాలపై కాంతి పడినప్పుడు అది సహజంగానే బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. దీనిని 'స్ట్రక్చరల్ కలరేషన్' అంటారు. ఈ సాంకేతికత వల్ల రాబోయే రోజుల్లో రసాయనాలు లేని, రంగు వెలిసిపోని బట్టలను తయారుచేయవచ్చు. ఒకప్పుడు కేవలం రాజులకే పరిమితమైన ఈ దైవిక వస్త్రాన్ని, సముద్ర వ్యర్థాల నుండి సామాన్యుడికి సైతం అందుబాటులోకి తీసుకురావడం సైన్స్ సాధించిన అద్భుత విజయమనే చెప్పాలి. ఒక అరుదైన సాంస్కృతిక వారసత్వానికి కొరియా శాస్త్రవేత్తలు మళ్లీ జీవం పోశారు.