US-Iran Deal: అమెరికా - ఇరాన్ డీల్‌లో కీలక అంశాలు...ఆలస్యానికి ఇవే కారణాలు
అమెరికా ఇరాన్ మధ్య డీల్ ముగింపు దశకు చేరుకుంటున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని విషయాల్లో ఇరుపక్షాలు అంగీకరించడం లేదని సమాచారం.
US-Iran Deal: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అత్యంత కీలకమైన అంతర్జాతీయ పరిణామం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక భారీ ఒప్పందం కుదిరేందుకు అడుగులు పడుతున్నాయి. అయితే, ఈ ఒప్పందంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనడానికి ప్రధాన కారణం...వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఇరాన్ ప్రయత్నించడమే. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సహజ జలమార్గం గుండా వెళ్లే ఓడలపై పన్ను వసూలు చేసే హక్కు ఇరాన్‌కు లేదు. కానీ, తాము అందించే భద్రతకు గానూ అక్కడ ప్రత్యేకంగా "సర్వీస్ ఫీజు" వసూలు చేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఈ ఒక్క అంశమే ఇప్పుడు చర్చలను మరింత ఆలస్యం చేస్తోంది. ఒప్పందంలోని కీలక ప్రతిపాదనలు ఏంటో తెలుసుకుందాం.
యుద్ధ వాతావరణానికి ముగింపు
గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో సాగుతున్న ఉద్రిక్తతలకు స్వస్తి పలకడం ఈ డీల్ యొక్క మొదటి ప్రాధాన్యత. ఇరుపక్షాలు శాంతిని నెలకొల్పేందుకు, ప్రాంతీయంగా దాడులను తగ్గించేందుకు ఒక విస్తృత కాల్పుల విరమణ ఒప్పందంపై పనిచేస్తున్నాయి. చాలా కాలంగా ఈ ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నా ఒకడుగు ముందుకు వేస్తే పదడుగులు వెనక్కి పడుతున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమంపై నియంత్రణ
అమెరికా ప్రధాన లక్ష్యం ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడం. ఇందులో భాగంగా, ఇరాన్ వద్ద ఉన్న అత్యధికంగా సమృద్ధి చేసిన యురేనియం నిల్వలను నాశనం చేయడం లేదా దేశం దాటించడంపై చర్చలు జరుగుతున్నాయి. డీల్ కుదిరిన తర్వాత దాదాపు 60 రోజుల పాటు దీనిపై సాంకేతిక చర్చలు సాగనున్నాయి. అయితే, ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం కేవలం శాంతియుత విద్యుత్ అవసరాల కోసమేనని స్పష్టం చేస్తోంది. కానీ, ఈ విషయంలో ఇరాన్‌ను అమెరికా నమ్మడం లేదు. ముఖ్యంగా ఇజ్రాయిల్ దీనికి ససేమిరా అంటోంది.
$24 బిలియన్ డాలర్ల నిధుల విడుదల
అమెరికా విధించిన ఆంక్షల వల్ల విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన దాదాపు 24 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 2 లక్షల కోట్ల పైమాటే... ఇరాన్ ఆస్తులను తిరిగి విడుదల చేయడం ఈ డీల్‌లో అతిపెద్ద ఆకర్షణ. ఈ నిధులు అందితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభిస్తుంది. ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా చెబుతున్నా అందులో ఎలాంటి కండీషన్లు పెడుతుందో చెప్పలేం.
ఆర్థిక ఆంక్షల సడలింపు
ఇరాన్ అణు పరిమితులకు అంగీకరిస్తే, అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ సమాజం ఇరాన్‌పై ఉన్న ఆర్థిక, చమురు ఎగుమతుల ఆంక్షలను దశలవారీగా ఎత్తివేసే అవకాశం ఉంది. దీని వలన ప్రపంచ దేశాలకు పెద్ద ఊరట లభిస్తుంది. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేయడానికి చైనా, భారత్‌తో పాటు పలు దేశాలు సిద్దంగా ఉంటాయి.
హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ
ప్రపంచవ్యాప్త ఇంధన రవాణాకు హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకం. వాణిజ్య నౌకల ప్రయాణానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు అమెరికా ప్రయత్నిస్తుంటే, అక్కడ తన రక్షణ పాత్రకు గుర్తింపు, నష్టపరిహారం కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. కానీ, రక్షణ పాత్రకు గుర్తింపు ఇవ్వడాన్ని, అదేవిధంగా నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు కూడా అమెరికా సుముఖంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు.
ఒప్పందం ఆలస్యానికి ప్రధాన అడ్డంకులు
ఈ చర్చలు ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తున్నా, కొన్ని కీలక పాయింట్ల వద్ద బ్రేకులు పడుతున్నాయి. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఇరాన్ ప్రతిపాదించిన ఫీజు నిర్మాణాన్ని అమెరికా సులభంగా అంగీకరించేలా లేదు. అదేవిధంగా, ఈ చర్చల్లో భాగస్వామి కానప్పటికీ, ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను, దాని అనుబంధ తీవ్రవాద గ్రూపులను అణచివేయకుండా కుదిరే ఏ ఒప్పందాన్ని అయినా తాము వ్యతిరేకిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఈ సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలతో పోలిస్తే ప్రస్తుతం ఇరు దేశాలు ఒక మైలురాయి ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డీల్ గనుక సఫలమైతే, ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో పాటు అంతర్జాతీయంగా శాంతి నెలకొనే అవకాశం ఉంది.