Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా వార్ః మొదటి ప్రపంచ యుద్ధాన్ని మించేలా
ప్రపంచ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న యుద్ధంగా రష్యా ఉక్రెయిన్ వార్ మిగిలిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని దాటేసిన ఈ యుద్ధం ఎప్పటి ముగుస్తుందోనని ఎదురు చూస్తున్నారు.
Russia-Ukraine War: ప్రపంచ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయే దిశగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఉక్రెయిన్ సరిహద్దులు దాటినప్పుడు, ఈ పోరు కేవలం కొన్ని రోజుల్లోనే ముగుస్తుందని అంతా భావించారు. కానీ, ఈ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్లు దాటిపోయింది. ‘న్యూయార్క్ టైమ్స్’ తాజా నివేదిక ప్రకారం, ఈ ఘర్షణ నేటికి 1,569 రోజులకు చేరుకుంది. ఇది 1914 నుండి 1918 వరకు సాగిన మొదటి ప్రపంచ యుద్ధం కాలపరిమితి కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఒక చిన్న దేశాన్ని లొంగదీసుకోవాలనుకున్న రష్యా అంచనాలను తలకిందులు చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై సాగుతున్న అత్యంత సుదీర్ఘమైన, రక్తపాత యుద్ధంగా ఇది నిలిచింది.
మొదటి ప్రపంచ యుద్ధంతో పోలికలు... ఆధునిక సాంకేతికత!
గత శతాబ్దపు యుద్ధాలకు, నేటి యుద్ధానికి ఉన్న పోలికలను రక్షణ నిపుణులు నిరంతరం విశ్లేషిస్తున్నారు. నాడు మెషిన్ గన్లు, ట్యాంకులు యుద్ధ గమనాన్ని మార్చితే, నేడు డ్రోన్లు, ప్రిసిషన్ గైడెడ్ మిస్సైళ్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు ఈ యుద్ధాన్ని శాసిస్తున్నాయి. అయినప్పటికీ, మొదటి ప్రపంచ యుద్ధంలాగా ఇరుపక్షాల సైనికులు భూగర్భ కందకాలలో ఉండి నెలల తరబడి పోరాడటం, భారీగా ప్రాణనష్టం జరగడం వంటివి నాటి భయానక పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. ఉక్రెయిన్ సైనికుల అభిప్రాయం ప్రకారం, ఈ యుద్ధం 2022లో మొదలైనట్లు కనిపిస్తున్నా, నిజానికి 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడే దీనికి పునాది పడింది. ఆ కోణంలో చూస్తే ఇది దశాబ్ద కాలపు పోరాటం.
దౌత్య వ్యూహాలు... విఫలమైన ప్రయత్నాలు
ఈ యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయంగా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చారు. అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రెడ్ కార్పెట్ పరిచి, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కెమెరాల ముందు కరచాలనాలు, శాంతి ప్రకటనలు కనిపించినా, తెర వెనుక యుద్ధ విమానాల మోత ఆగలేదు. మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పశ్చిమ దేశాల మద్దతు కోసం నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉన్నారు. అమెరికా ఆర్థిక సాయం, నాటో దేశాల ఆయుధాలే ఉక్రెయిన్ ఇన్నాళ్లూ తట్టుకొని నిలబడటానికి ప్రధాన కారణం.
‘వెర్సైల్స్ ఒప్పందం’ నేర్పే పాఠం
‘ది ఎకనామిస్ట్’ పత్రిక విశ్లేషణ ప్రకారం, ఈ యుద్ధానికి ముగింపు పలకడం అంత సులువు కాదు. 1919లో జరిగిన 'వెర్సైల్స్ ఒప్పందం' మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించినప్పటికీ, అది జర్మనీలో రేపిన అసంతృప్తి రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా పూర్తిగా ఓడిపోయి లొంగిపోయే దేశం కాదు, అలాగని ఉక్రెయిన్ తన భూభాగాలను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి, భవిష్యత్తులో వచ్చే శాంతి ఒప్పందం కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేసేదిగా కాకుండా, శాశ్వత రక్షణ హామీలను ఇచ్చేదిగా ఉండాలి. ఊహించని ఈ సుదీర్ఘ యుద్ధం ఐరోపా రక్షణ నమూనాను పూర్తిగా మార్చేసింది. పశ్చిమ దేశాల ఐక్యతకు, రష్యా సైనిక వ్యూహాలకు ఇదొక పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుతానికైతే ఈ రణరంగానికి ముగింపు ఎప్పుడనేది ఎవరికీ అందని ప్రశ్నార్థకంగానే మిగిలింది. భవిష్యత్తులో ఈ రెండు దేశాలను చూసి యుద్ధం చేసే పరిస్థితులు మిగతా దేశాల్లో రాకూడదని కోరుకుందాం.