Helicopter Crash : గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ప్రముఖ సింగర్‎తో పాటు మరో ఆరుగురు మృతి

Helicopter Crash : బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో రెండు హెలికాప్టర్లు గాల్లో ఢీకొన్న ప్రమాదంలో ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ ఓలివర్ ట్రీతో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2026-06-15 01:31 GMT

Oliver Tree

Helicopter Crash : అంతర్జాతీయంగా ఒక ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బ్రెజిల్‌లోని ప్రముఖ నగరం రియో డి జెనీరో పశ్చిమ ప్రాంతంలో ఆదివారం ఉదయం రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ భయంకరమైన ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ప్రయాణిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ ఓలివర్ ట్రీతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియగానే ప్రపంచ సంగీత పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

స్థానిక అధికారులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం సుమారు 8:59 గంటల సమయంలో జరిగింది. గాల్లో క్రాష్ అయిన హెలికాప్టర్లలో ఒకటి కింద ఉన్న ఒక ప్రముఖ కార్ల షోరూమ్‌పై పడిపోయింది. ఆ షోరూమ్‌లో అనేక సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ప్రదర్శనకు ఉంచారు. హెలికాప్టర్ పడటమే ఆలస్యం పెద్ద ఎత్తున మంటలు చెలరేగి షోరూమ్‌ను చుట్టుముట్టాయి. ఈ అగ్నిప్రమాదం కారణంగా అక్కడ పార్క్ చేసి ఉన్న దాదాపు 20కి పైగా వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ ఘోర ప్రమాదంలో ఎయిర్‌బస్ హెచ్125, బెల్ 206బి జెట్ రేంజర్ రకానికి చెందిన హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయి. ఒక హెలికాప్టర్‌లో సింగర్ ఓలివర్ ట్రీతో పాటు మరో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. మరణించిన వారిలో లూకాస్ విగ్నాల్, గ్యాస్పర్ ప్రిమ్, లూకాస్ బ్రిటో చావెజ్, పైలట్ అలెక్స్ సూజా ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, రెండో హెలికాప్టర్‌లో ఒంటరిగా ప్రయాణిస్తున్న పైలట్ చార్లెస్ మార్సిలాక్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలపై బ్రెజిల్ విమానయాన అధికారులు విచారణ ప్రారంభించారు.

కేవలం 32 ఏళ్ల వయసున్న ఓలివర్ ట్రీ అంతర్జాతీయ మ్యూజిక్ వరల్డ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2010లో కేవలం 17 ఏళ్ల ప్రాయంలోనే ట్రీ పేరుతో స్క్రిల్లెక్స్, జెడ్స్ డెడ్ వంటి ప్రముఖులతో కలిసి కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2013లో ఒక ఇండిపెండెంట్ ఆల్బమ్ విడుదల చేసి, మ్యూజిక్ టెక్నాలజీ చదువు కోసం చిన్న బ్రేక్ తీసుకున్నాడు. 2020లో ఆయన విడుదల చేసిన మొదటి స్టూడియో ఆల్బమ్ అగ్లీ ఈజ్ బ్యూటిఫుల్ అమెరికాలో 'గోల్డ్' సర్టిఫికేషన్ సాధించింది. అందులోని లైఫ్ గోస్ ఆన్ అనే పాట ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయి ప్లాటినం సర్టిఫికేట్ దక్కించుకుంది.

తన మొదటి ఆల్బమ్ విజయవంతం అయిన తర్వాత ఓలివర్ ట్రీ వరుసగా కౌబాయ్ టియర్స్, అలోన్ ఇన్ ఎ క్రౌడ్, ఈ ఏడాది ఏప్రిల్‌లోనే లవ్ యూ మ్యాడ్లీ హేట్ యూ బ్యాడ్లీ వంటి పాపులర్ ఆల్బమ్స్, సాంగ్స్ విడుదల చేశాడు. రాబోయే రోజుల్లో ఆయన పలు అంతర్జాతీయ సంగీత కచేరీలు చేయాల్సి ఉంది. జూలై 1 నుంచి పోర్చుగల్‌లోని లిస్బన్‌లో మొదటి షో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, చైనాల్లో ఆయన టూర్స్ లైన్ లో ఉన్నాయి. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరిగి ఓలివర్ ట్రీ కన్నుమూయడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News