Asia Economy: ఇరాన్‌ పేల్చిన ఆర్థిక విస్పోటనం... ఆసియా దేశాల్లో ప్రకంపనలు

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూసుకుపోవడంతో, ఆసియా దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభంలో కూరుకుపోయాయి.

Update: 2026-05-11 05:03 GMT

Asia Economy: ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూసుకుపోవడంతో, ఆసియా దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభంలో కూరుకుపోయాయి. పెరిగిన చమురు ధరలు, కరెన్సీల పతనం వెరసి సామాన్యుడి జీవితం భారంగా మారింది.

ప్రస్తుతం ఆసియా ఖండం ఒక గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్ యుద్ధం చిచ్చు కేవలం ఆ దేశానికే పరిమితం కాలేదు; అది ఆసియా ఆర్థిక వ్యవస్థల పునాదులను కదిలిస్తోంది. ఇంధనం కోసం గంటల తరబడి క్యూలైన్లు, కరెంటు కోతలు, ఇంటి నుండే పని.. ఇవన్నీ ఒకప్పుడు వినడానికి వింతగా ఉండేవేమో కానీ, ఇప్పుడు ఆసియాలోని ప్రధాన నగరాల్లో ఇవి నిత్యకృత్యమయ్యాయి.

హార్ముజ్ జలసంధి - ఆసియా గొంతుపై కత్తి

ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు 20% నుండి 30% వాటా ఒక్క 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' ద్వారానే జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ మార్గం అస్తవ్యస్తం కావడంతో ఆసియా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర ఊహించని స్థాయికి చేరుకుంది. ఇది దిగుమతి బిల్లులను భారీగా పెంచేసింది. ప్రస్తుతం బ్యారెల్‌ ధర 120 డాలర్లకు చేరడంతో చమురు కొరతతో ప్రపంచ దేశాలు ముఖ్యంగా ఆసియా దేశాలు విలవిలలాడిపోతున్నాయి. భారం పెరుగుతున్నా రాజకీయంగా అనిశ్చితి నెలకొనకూడదనే సదుద్దేశంతో భారాన్ని ప్రభుత్వాలు మోస్తున్నాయి. ఇలా ఎంతకాలం మోయగలవో స్పష్టంగా తెలియడం లేదు. ఒకవైళ ఇలాంటి సమయంలో చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపై పడుతుంది. భారత్ లాంటి దేశాలు పెద్ద ఎత్తున గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది.

ఆర్ధిక వ్యవస్థలపై 'ట్రిపుల్' దెబ్బ

ఆసియా దేశాలు ప్రస్తుతం మూడు రకాల దాడులను ఎదుర్కొంటున్నాయి. అందులో మొదటిది డాలర్‌ సెగ. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే చమురు, ఆహారం, ఎరువులు వంటివన్నీ కూడా డాలర్లలోనే కొనుగోలు చేయాలి. స్థానిక కరెన్సీలు బలహీనపడటంతో గతంలో కంటే 15 నుంచి 20 శాతం అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. దీని వలన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు, యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో పనిచేసే ఆసియా కార్మికులు సొంత దేశాలకు డబ్బును పంపుతుంటారు. అయితే, యుద్ధం కారణంగా డబ్బు పంపిణి తగ్గిపోయింది. విదేశీ మారక నిల్వలపై కోలుకోలేని దెబ్బ పడింది. ఇంధనం ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగాయి. నిత్యావసర వస్తువల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీని వలన సామాన్యులు ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వీలైనంత త్వరగా ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని వేడుకుంటున్నాడు.

ప్రభుత్వాల సవాల్ - రేషనింగ్ వైపు అడుగులు

పరిస్థితి విషమించకుండా ఉండేందుకు కొన్ని దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇంధనం వినియోగాన్ని తగ్గించడానికి వారానికి 2 రోజులు సెలవు ప్రకటించడం లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో పని గంటలు తగ్గించడం వంటివి చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు తమ దగ్గర ఉన్న విదేశీ నిల్వలను కాపాడుకోవడానికి ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు ఇప్పటికే అప్పుల ఊబిలో ఉండగా, భారత్, వియత్నాం వంటి వృద్ధి చెందుతున్న దేశాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోంది.

పరిష్కారం ఎక్కడ?

ఈ విపత్తు నుంచి గట్టెక్కాలంటే ఆసియా దేశాల ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, యుద్ధం త్వరగా ముగియాలని దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావడం. రెండు, శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి, సౌర, పవన విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు వందకు వంద శాతం వేగంగా మళ్లడం. ఇప్పటికే భారత్‌ వంటి దేశాలు సౌర, పవన విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నాయి. అదేవిధంగా చమురు నుంచి వచ్చే ఉత్పత్తులైన గ్యాస్‌ వాడకం కూడా తగ్గించి బయోగ్యాస్‌ను వినియోగించేలా ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్‌ వినియోగాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ప్రైవేట్‌ రవాణా కంటే ప్రభుత్వ రవాణాను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే, ఆసియా సామాన్యుడి జేబుకు అంతగా చిల్లు పడుతుంది. ఇంధన భద్రత అంటే కేవలం నిల్వలు పెంచుకోవడం కాదు, స్వయం సమృద్ధి సాధించడమే అని ఈ సంక్షోభం మనకు మరోసారి గుర్తు చేస్తోంది. అంతర్జాతీయ సంబంధాలు, ఇంధన భద్రతపై ఆసియా దేశాలు పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే, ఈ ఆర్థిక చిచ్చు ప్రతి ఇంటిని తాకుతుంది. ఇరాన్‌, అమెరికాలపై ఒత్తిడి తీసుకురావడం, హోర్మూజ్‌ జలసంధిని గతంలో మాదిరిగా ఫ్రీ రవాణాకు వినియోగించుకునేలా చేయడం ప్రపంచం ముందున్న లక్ష్యాలు.   

Tags:    

Similar News