Digital Tax : డిజిటల్ బాంబు పేల్చిన ఇరాన్.. గూగుల్, ఫేస్‌బుక్‌లు కూడా ట్యాక్స్ కట్టాల్సిందేనా?
Digital Tax : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కొత్త డిజిటల్ ట్యాక్స్ ప్రణాళికను సిద్ధం చేసింది. సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా వెళ్లే డేటాపై పన్ను వసూలు చేయాలని ముజ్తబా నిర్ణయించడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది.
Digital Tax
Digital Tax : ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమైంది. ఇప్పటివరకు సముద్రం మీదుగా వెళ్లే చమురు నౌకల నుంచి టోల్ టాక్స్ వసూలు చేస్తున్న ఇరాన్, ఇప్పుడు సముద్రం అడుగున ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా వెళ్లే డిజిటల్ డేటా పై కూడా పన్ను వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇరాన్ నాయకుడు ముజ్తబా ఆడుతున్న ఈ ట్రిలియన్ డాలర్ల గేమ్ ఇప్పుడు ఆసియా నుంచి యూరప్ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది.
డిజిటల్ డేటాపై ఇరాన్ కన్నేసింది ఎందుకు?
డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ చమురు వ్యాపారం దెబ్బతింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇరాన్ ఇప్పుడు డిజిటల్ మార్గాన్ని ఎంచుకుంది. హోర్ముజ్ జలసంధి అడుగున సుమారు 20కి పైగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ సుమారు 10 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక లావాదేవీల డేటా (SWIFT బ్యాంకింగ్, షేర్ మార్కెట్ డేటా) బదిలీ అవుతుంది. ఈ కేబుల్స్ తన సముద్ర జలాల్లో ఉన్నందున, ఆ డేటాపై తమకు హక్కు ఉందని ఇరాన్ వాదిస్తోంది.
అంతర్జాతీయ చట్టాలతో ఇరాన్ లాజిక్
ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS)లోని ఆర్టికల్ 34, 79ని ఇరాన్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. ఈ చట్టం ప్రకారం సముద్ర ఉపరితలంపై నౌకల రాకపోకలను అడ్డుకోలేకపోయినా, సముద్ర గర్భంపై సదరు దేశానికే పూర్తి నియంత్రణ ఉంటుంది. హోర్ముజ్ జలసంధి కేవలం 39 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండటంతో, అందులో సగం భాగం ఇరాన్ ప్రాదేశిక జలాల కిందకు వస్తుంది. అక్కడ కేబుల్స్ వేయాలన్నా లేదా వాటిని రిపేర్ చేయాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
టెక్ దిగ్గజాలకు భారీ షాక్
ఇరాన్ రూపొందించిన కొత్త ప్రణాళిక ప్రకారం మెటా (ఫేస్‌బుక్), అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు ఇరాన్ నుంచి ప్రత్యేక అనుమతి (పర్మిట్) తీసుకోవాలి. అంతేకాకుండా ఏటా భారీ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ దేశమైనా లేదా కంపెనీ అయినా ఈ పన్ను కట్టడానికి నిరాకరిస్తే, ఆ డేటా ట్రాన్స్‌ఫర్‌ను నిలిపివేస్తామని లేదా కేబుల్స్ కట్ చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇది జరిగితే ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ బ్లాక్‌అవుట్ వచ్చే ప్రమాదం ఉంది.
అరబ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు ముప్పు
ఈ డిజిటల్ పన్ను వల్ల గల్ఫ్ దేశాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కతర్ తన ఇంటర్నెట్ కోసం 99%, కువైట్ 95%, యూఏఈ 90% వరకు హోర్ముజ్ గుండా వెళ్లే కేబుల్స్ పైనే ఆధారపడి ఉన్నాయి. ఫాల్కన్, టిజిఎన్ గల్ఫ్, జిబిఐ బ్రిడ్జ్ వంటి కీలక కేబుల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇరాన్ గనుక డేటా బ్లాక్ చేస్తే అరబ్ దేశాల బ్యాంకింగ్, బిజినెస్ రంగాలు పూర్తిగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ఇప్పుడు కేవలం మిసైళ్లతోనే కాదు, ఇంటర్నెట్ కేబుల్స్ తో కూడా జరుగుతుందని ఇరాన్ నిరూపిస్తోంది.