North Korea Nuclear Policy: కిమ్ మరణిస్తే... ప్రపంచం మరణమృదంగమే..
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మనస్తత్వం గురించి ప్రపంచ దేశాలకు ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఆ భయం కాస్తా భీభత్సంగా మారబోతోంది.
North Korea Nuclear Policy: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మనస్తత్వం గురించి ప్రపంచ దేశాలకు ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. ఇప్పుడు ఆ భయం కాస్తా భీభత్సంగా మారబోతోంది. "నేను లేని లోకం నాకు వద్దు.. నేను మరణిస్తే ప్రపంచం మొత్తం మరణ మృదంగం మోగాల్సిందే" అనే రీతిలో కిమ్ తన రాజ్యాంగాన్నే మార్చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం కిమ్‌పై దాడి జరిగితే, ఆ క్షణమే ప్రపంచంపై అణ్వాయుధాలు విరుచుకుపడతాయి.
డెడ్ హ్యాండ్ పాలసీ - కిమ్ మరణిస్తే అణు యుద్ధమే!
ఇటీవల ప్యాంగ్యాంగ్‌లో జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశంలో ఉత్తర కొరియా తన అణ్వాయుధ విధానాన్ని సవరించింది. సవరించిన విధానం ప్రకారం... ఒకవేళ విదేశీ దాడుల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రాణాలు కోల్పోతే లేదా దేశ నాయకత్వం దెబ్బతింటే ఎవరి ఆదేశాలు కోసం వేచి చూడకుండా అణ్వాయుధ వ్యవస్థలు స్వయంగా శతృవులపై దాడి చేస్తాయి. అంతేకాదు, శతృదేశాలు తమపై దాడి చేసే సూచనలు ఉన్నాయని తెలిస్తే చాలు...తామే ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించే విధంగా కూడా రాజ్యాంగాన్ని సవరించారు. ఈ సవరణలతో ఆసియా దేశాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా శతృదేశాలుగా భావించే దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటు అమెరికాకు ఈ నిర్ణయంతో కలవరపాటుకు గురైంది. ఇప్పటికే ఉత్తరకొరియాపై దాడి చేయాలంటే ప్రపంచ దేశాల్లో తెలియని భయం ఉంది. ఇప్పుడు కిమ్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత భయాందోళనలు నెలకొన్నాయి.
ఇరాన్ పరిణామాలే పాఠాలుగా
కిమ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇరాన్‌లో జరిగిన పరిణామాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మరణించడం ఆ తరువాత సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా...అనేకమంది కీలక నేతలు మరణించారు. ఈ పరిణామాలను గమనించిన కిమ్... భవిష్యత్తులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భావించారు. తనను ఎవరూ టార్గెట్ చేయకుండా ఉండేందుకు సూసైడ్ అటాక్ తరహా విధానాన్ని రాజ్యాంగంలో చేర్చారు. దశాబ్దాల క్రితం రష్యా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు నార్త్ కొరియా కూడా తీసుకున్నదని అనుకోవచ్చు.
దక్షిణ కొరియా సరిహద్దులో యుద్ధ మేఘాలు
దక్షిణ కొరియా నిఘా సంస్థ సమాచారం ప్రకారం, కిమ్ ప్రభుత్వం ఈ ఏడాదే సరిహద్దుల్లో దీర్ఘశ్రేణి ఆయుధాలను మోహరించబోతోంది. కిమ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం అంచున నిలబడినట్లయింది. ముఖ్యంగా 2026 నాటికి ఉత్తర కొరియా అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరగనుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతే ఉత్తర కొరియాను అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఇరాన్ మాదిరిగా నార్త్ కొరియా లొంగే రకం కాదు. అణ్వాయుధాలతో పాటు ఎవరూ ఊహించని విధంగా ఆయుధాలను ఆ దేశం కలిగి ఉన్నది.
మొక్కై వంగనిది మానై వంగునా అన్నట్లు కిమ్ తన నియంతృత్వాన్ని ఏ స్థాయిలో పెంచుకుంటున్నారో ఈ రాజ్యాంగ సవరణలు నిరూపిస్తున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన దేశాలు, ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ కదిలించే 'అణు' అగ్నిగోళం నుంచి ఎలా తప్పించుకోవాలో అని చర్చలు జరుపుతున్నాయి. కిమ్ మరణం ప్రపంచానికి మరణ శాసనం కాకూడదని ఆశిద్దాం. భూమిపై మనిషి మనుగడ సాగించాలంటే అణ్వాయుధాల ముప్పు లేకుండా ఉండాలి. అణ్వాయుధాల వాడకం ఉండకూడదు అంటే ప్రపంచ నేతలు ఇగోలకు వెళ్లకుండా సామరస్యంతో వ్యవహరించడం ఉత్తమం. అభివృద్ధి చెందడంలో శతృత్వం ఉంటే అది ఆరోగ్యకరం అవుతుంది. మనుగడ సాధ్యమౌతుంది.