Bike Accident: అక్కడ ఎలా పెట్టావ్ రా..గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్‌కు వేలాడిన బైక్
Bike Accident: కెనడాలోని సర్రేలో ఒక వింత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Bike Accident
Canada: కెనడా వీధుల్లో ఒక హాలీవుడ్ యాక్షన్ సినిమా సీన్‌ను తలపించేలా జరిగిన ఈ వింత రోడ్డు ప్రమాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. కారు-బైక్ ఢీకొంటే బైక్ పక్కకు పడిపోవడం మనం చూస్తుంటాం.. కానీ ఇక్కడ ఏకంగా బైక్ రెక్కలు కట్టుకుని గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కు వేలాడింది.రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు పైకి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. బైక్ అక్కడ ఎలా ఉంది? అని ఆశ్చర్యంతో జనం గుమిగూడారు.
ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన విలియమ్ చాన్ అనే వ్యక్తి తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. నేను డోనట్స్ కొనేందుకు వెళ్తుండగా జంక్షన్ మధ్యలో ఒక కారు ధ్వంసమై కనిపించింది. సరే, ఢీకొన్న రెండో వాహనం ఎక్కడ ఉందా అని చుట్టుపక్కల వెతికాను. కానీ ఎక్కడా కనిపించలేదు. తీరా తలెత్తి పైకి చూస్తే.. బైక్ సిగ్నల్ స్తంభానికి వేలాడుతూ ఉంది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. ఇదొక సినిమా షూటింగ్ లా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
ప్రమాద తీవ్రత చూస్తే బైక్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాలతో ఉండటం అసాధ్యమని ఎవరైనా భావిస్తారు. కానీ అదృష్టవశాత్తూ అతనికి తీవ్ర గాయాలైనప్పటికీ, ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. బైకర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదని డెల్టా పోలీసులు ధృవీకరించారు.
ట్రాఫిక్ సిగ్నల్ నుంచి ఆ బైక్‌ను కిందికి దించడానికి అధికారులు ప్రత్యేక క్రేన్లను వాడాల్సి వచ్చింది. అప్పటివరకు ఆ వింతను చూసేందుకు జనం ఎగబడటంతో పోలీసులు ఆ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. జనం తమ మొబైల్స్‌లో తీసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రియల్ లైఫ్ జిమ్నాస్టిక్స్ అంటే ఇదేనేమో అని కొందరు, ఆ బైకర్ నిజంగా అదృష్టవంతుడు అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.