Guava Nursery: అరెకరంలో రూ.20 కోట్ల వ్యాపారం.. జామ మొక్కల సక్సెస్ స్టోరీ..!

Farming: వ్యవసాయం అంటే కేవలం వరి, మిర్చి సాగు మాత్రమే కాదు.. కాస్త ఆలోచన జోడిస్తే అరెకరం భూమిని కూడా లాభాల గనిగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంత రైతులు.

Update: 2026-04-24 09:33 GMT

Guava Nursery

Farming: వ్యవసాయం అంటే కేవలం వరి, మిర్చి సాగు మాత్రమే కాదు.. కాస్త ఆలోచన జోడిస్తే అరెకరం భూమిని కూడా లాభాల గనిగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంత రైతులు. పండ్ల అమ్మకం కంటే మొక్కల పెంపకమే మెరుగైన లాభాలను తెచ్చిపెడుతుండటంతో, ఈ ప్రాంతం ఇప్పుడు జామ నర్సరీల హబ్‌గా విరాజిల్లుతోంది.

నమ్మశక్యం కాని లాభాలు

సంప్రదాయ సాగుకు భిన్నంగా, ఆధునిక పద్ధతుల్లో జామ మొక్కలను ఉత్పత్తి చేస్తూ ఇక్కడి రైతులు అద్భుతాలు చేస్తున్నారు. ఈ రెండు మండలాల్లో కలిపి ఏడాదికి సుమారు 2 కోట్ల జామ మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మొక్కల విక్రయాల ద్వారా ఏటా దాదాపు రూ.20 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. కేవలం అరెకరం స్థలంలో ఛాంబర్స్ ఏర్పాటు చేసి, ఏడాదికి 10 లక్షల మొక్కల వరకు ఉత్పత్తి చేయడం ఇక్కడి ప్రత్యేకత.

క్లోన్ పద్ధతిలో సాగు

నాణ్యమైన క్లోన్ జామ మొక్కల తయారీ వెనుక ఎంతో సాంకేతికత, శ్రమ దాగి ఉన్నాయి. ముందుగా ఎంపిక చేసిన చెట్ల లేత చిగుళ్లను సేకరించి.. ఐపీ, టాల్కం పౌడర్, బావిస్టన్ వంటి ద్రావణాలతో శుద్ధి చేస్తారు. ఈ కొమ్మలను ప్లాస్టిక్ ట్రేలలో ఉంచి, 'మిస్ట్ ఛాంబర్'లో 35-40 రోజుల పాటు పెంచుతారు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆటోమేటిక్ పైపుల ద్వారా వీటికి నీటిని అందిస్తారు. ఛాంబర్ నుండి తీసిన తర్వాత మరో నెల రోజుల పాటు బెడ్ల మీద ఉంచి, పూర్తిస్థాయిలో మొక్క తయారయ్యాక విక్రయాలకు సిద్ధం చేస్తారు.

ఉపాధి కల్పనలోనూ మేటి

ఈ నర్సరీల వల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. కేవలం ఒక నర్సరీలోనే ఏడాది పొడవునా సుమారు 2 లక్షల మొక్కలను పెంచడానికి 7 నుండి 25 మంది కార్మికులు అవసరమవుతున్నారు. ఈ మండలాల్లో మొత్తం 30కి పైగా నర్సరీలు ఉండటంతో వందలాది కుటుంబాలకు ఇది జీవనోపాధిని అందిస్తోంది.

మార్కెటింగ్ ధరలు

మొక్క తయారీకి దాదాపు రూ.6-7 ఖర్చవుతుండగా, స్థానిక రైతులకు రూ.10 లోపే అందిస్తున్నారు. అయితే, పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే గిరాకీ కారణంగా అక్కడ ఒక్కో మొక్కను రూ.30 వరకు విక్రయిస్తూ భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. పండ్ల తోటల పెంపకం వైపు మొగ్గు చూపుతున్న నేటి తరుణంలో, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందుతున్న ఈ జామ నర్సరీల వ్యాపారం యువ రైతులకు ఒక దిక్సూచిలా కనిపిస్తోంది.

Tags:    

Similar News