Farming: రైతులకు పెద్ద వరం..మొండి నేలలోనూ బంగారు పంట..!
Farming: పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉండే పంట కోసం చూస్తున్నారా? అయితే వాము సాగు మీకు సరైన ఎంపిక.
Farming
Ajwain farming: వ్యవసాయం అంటేనే పెట్టుబడుల భారం, చీడపీడల బెడద అని భయపడే రోజులివి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా అతి తక్కువ ఖర్చుతో, ఎటువంటి నేలనైనా బంగారంగా మార్చే శక్తి వాము పంటకు ఉంది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా రైతులు ఈ పంటను సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు.
ఎటువంటి నేలలైనా ఓకే
వాము పంట ప్రత్యేకత ఏంటంటే, ఇది మొండి పంట. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకుంటుంది. వర్షాధారంగా సాగు చేయాలనుకుంటే నల్లరేగడి నేలలు, నీటి పారుదల వసతి ఉంటే తేలికపాటి నేలలు ఈ పంటకు ఎంతో అనుకూలం. మంచుతో కూడిన వాతావరణం వాము పంటకు అమృతంలా పనిచేస్తుంది. అందుకే శీతాకాలం ఈ పంటకు ఎంతో అనుకూలం.
పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ!
సాధారణంగా ఇతర పంటలకు ఎరువులు, పురుగుల మందుల కోసం వేలల్లో ఖర్చు చేయాలి. కానీ వాముకు ఆ అవసరం లేదు. ఆగస్టులో విత్తనాలు చల్లితే, కేవలం 5 నెలల్లో పంట చేతికి వస్తుంది. విత్తనం నాటిన రెండు నెలల తర్వాత ఒకసారి కలుపు తీస్తే సరిపోతుంది. ఎరువులు, మందుల పిచికారీ ఖర్చులు చాలా నామమాత్రం. కేవలం పంట కోత సమయంలోనే కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
మార్కెట్‌లో భారీ డిమాండ్
వాముకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఔషధ గుణాలు ఉండటంతో దీనికి డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. ఎకరాకు సుమారు 3 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. నేల స్వభావాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలుకు రూ. 16,000 నుంచి రూ. 19,000 వరకు ధర పలుకుతోంది. వికారాబాద్ జిల్లా రేగడిమైలారానికి చెందిన ఒక రైతు 10 ఎకరాల్లో సాగు చేయగా, వర్షాల వల్ల దిగుబడి కాస్త తగ్గినా 22 క్వింటాళ్ల పంట వచ్చింది. క్వింటాలుకు రూ. 16,000 ధర వచ్చినా, ఖర్చులు పోను లక్షల్లో లాభం మిగిలింది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, తక్కువ శ్రమతో స్థిరమైన ఆదాయం పొందాలనుకునే రైతులకు వాము సాగు ఒక మేలైన మార్గం. వికారాబాద్, పరిగి మార్కెట్లలో వాముకు ఉన్న డిమాండ్‌ను చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.