Vinukonda: పేదల బియ్యం రీసైక్లింగ్ చేస్తే ఉపేక్షించం: జీవీ ఆంజనేయులు!
Vinukonda: వినుకొండ నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమాలకు పాల్పడితే డీలర్‌షిప్ రద్దుతో పాటు కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.
Vinukonda: పేదల బియ్యం రీసైక్లింగ్ చేస్తే ఉపేక్షించం: జీవీ ఆంజనేయులు!
వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, రీసైక్లింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడే వ్యక్తులతో పాటు సంబంధిత రేషన్ షాపు డీలర్లపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రతి నెలా సకాలంలో నాణ్యమైన రేషన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గతంలో కొన్ని గ్రామాల్లో రేషన్ పంపిణీ యంత్రాల్లో సాంకేతిక సమస్యల కారణంగా సరఫరాలో జాప్యం జరిగిందని, సమస్యను వెంటనే పరిష్కరించి లబ్ధిదారులకు రేషన్ అందించినట్లు జీవీ తెలిపారు. రేషన్ సరఫరాలో ఎక్కడైనా అలసత్వం చోటుచేసుకున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొందరు చేస్తున్న ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారమని ఆయన పేర్కొన్నారు.
అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తోందన్నారు.రేషన్ ఇవ్వకపోతే ప్రజలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని జీవీ ఆంజనేయులు సూచించారు. అక్రమాలకు పాల్పడే డీలర్ల డీలర్‌షిప్‌ను రద్దు చేయడంతో పాటు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.