Viral: నన్ను మోసం చేసింది.. చంపేశా.. భార్యను చంపే ముందు వాట్సాప్ స్టేటస్.!
Viral: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘతుకం చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి ఒకరు తన విడాకుల కేసు విచారణలో
Wife Murder
Viral: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో గురువారం అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘతుకం చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగి ఒకరు తన విడాకుల కేసు విచారణలో ఉండగానే, ఐసీఐసీఐ (ICICI) బ్యాంకులో పనిచేస్తున్న తన భార్యను ఆఫీసు బయటే పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపాడు. ఆ తర్వాత తన అద్దె ఇంటికి వెళ్లి, సొంత చెల్లెలిని కూడా తుపాకీతో కాల్చిచంపి, తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వరుస హత్యలు, ఆత్మహత్య ఘటనలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ బయటే భార్యపై కాల్పులు
లక్నోలోని గోమతీనగర్ ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ శాఖలో దివ్య మిశ్రా (36) అసిస్టెంట్ మేనేజర్‌గా, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేస్తోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె భర్త, ఎస్‌బీఐ ఉద్యోగి మానస్ బాజ్‌పాయ్ (38) బ్యాంకు వద్దకు వచ్చాడు. దివ్యకు ఫోన్ చేసి బయటకు రమ్మని కోరాడు. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య కొంతసేపు తీవ్రమైన మాటల యుద్ధం జరిగింది. ఆవేశానికి లోనైన మానస్, తన వద్ద ఉన్న తుపాకీ తీసి దివ్యపై కాల్పులు జరిపాడు. తీవ్ర రక్తస్రావంతో దివ్య అక్కడికక్కడే కుప్పకూలిపోగా, ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్థానికులు, బ్యాంకు సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
వాట్సాప్ స్టేటస్‌లో సంచలన ఆరోపణలు
భార్యపై దాడికి పాల్పడటానికి కొద్దిసేపటి ముందే మానస్ బాజ్‌పాయ్ తన వాట్సాప్ ఖాతాలో పెట్టిన ఒక స్టేటస్ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో అత్యంత కీలక ఆధారంగా మారింది. "ఈరోజు నేను నన్ను మోసం చేసిన నా భార్యను చంపాను... ఇప్పుడు నేను, నా చెల్లెలు కూడా చనిపోవాల్సిందే. ఆమె సోదరి ప్రజ్ఞ, భరత్ అనే వ్యక్తికి ఈ విషయాలన్నీ తెలుసు" అని ఆ స్టేటస్‌లో రాసుకొచ్చాడు. ఈ సందేశంలో ప్రస్తావించిన దివ్య సోదరి ప్రజ్ఞా మిశ్రా ప్రముఖ యూట్యూబర్ (YouTuber) కావడం గమనార్హం. కాగా, ఈ వాట్సాప్ స్టేటస్‌లో మానస్ చేసిన ఆరోపణల నిజానిజాలను పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఇంటికి వెళ్లి చెల్లెలిని చంపి.. తాను ఆత్మహత్య
భార్యను కాల్చిచంపిన అనంతరం మానస్ హుసాడియా క్రాసింగ్ వద్ద ఉన్న తన అద్దె ఇంటికి చేరుకున్నాడు. అక్కడ తన చెల్లెలు తూళిక (33)తో కలిసి ఆయన నివాసముంటున్నాడు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో మానస్ తీవ్రమైన చెమటలతో, తీవ్ర ఒత్తిడితో ఇంటికి వచ్చాడని, గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని స్థానిక టిఫిన్ సెంటర్ నిర్వహకుడు పోలీసులకు తెలిపాడు. కొద్దిసేపటికే ఆ గది నుంచి తుపాకీ పేలిన శబ్దాలు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా, మానస్ తన చెల్లెలు తూళికను కాల్చి చంపిన తర్వాత, అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.
దంపతుల మధ్య విడాకుల వివాదం
ఈ దారుణానికి దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. భర్త మానస్ బాజ్‌పాయ్ నుంచి విడాకులు కోరుతూ దివ్య మిశ్రా సుమారు ఏడాది క్రితం కోర్టును ఆశ్రయించింది. అలంబాగ్‌లో నివాసముంటున్న దివ్య, మానస్‌ల మధ్య గతకొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. కోర్టు కేసు , విడాకుల వ్యవహారమే ఈ త్రయం హత్యలకు, ఆత్మహత్యకు దారితీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వేగవంతమైన పోలీస్ దర్యాప్తు
సంఘటనా స్థలాలకు చేరుకున్న సీనియర్ పోలీస్ అధికారులు, ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌లు, దంపతుల కాల్ డేటా రికార్డులు (CDR) , డిజిటల్ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. బ్యాంకు వద్ద నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో మానస్ కదలికలను సీసీటీవీల ద్వారా పరిశీలిస్తున్నారు. హత్యలకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.