Suspicious Death : ఫ్యాన్‌కు వేలాడిన భర్త.. వీడియో తీసిన 7 ఏళ్ల కొడుకు.!

Suspicious Death : గురుగ్రామ్‌లోని సూరత్ నగర్ ప్రాంతంలో ఒక ప్రముఖ బహుళజాతి (MNC) కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సంజీవ్ యాదవ్ అనే..

Update: 2026-08-02 05:22 GMT

Suspicious Death 

Suspicious Death : గురుగ్రామ్‌లోని సూరత్ నగర్ ప్రాంతంలో ఒక ప్రముఖ బహుళజాతి (MNC) కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సంజీవ్ యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఫ్యాన్‌కు వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. అమృత్‌సర్‌కు చెందిన సంజీవ్ యాదవ్, తన భార్య మన్‌ప్రీత్ కౌర్ , ఏడేళ్ల కుమారుడితో కలిసి గురుగ్రామ్‌లో నివాసముంటున్నాడు. అయితే, ఇది ఆత్మహత్య కాదని, తన కోడలే మరికొందరితో కలిసి కుట్ర పన్ని హత్య చేసిందని, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని సంజీవ్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రేమ వివాహం.. ఆపై మొదలైన మనస్పర్థలు

పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌లోని అంబాలాకు చెందిన మన్‌ప్రీత్ కౌర్, అమృత్‌సర్‌కు చెందిన సంజీవ్ యాదవ్‌లు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం గురుగ్రామ్‌లోని ‘డెన్సో’ అనే కంపెనీలో పనిచేస్తున్న సమయంలో పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2018 ఏప్రిల్ 29న ఇరువైపులా పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయినప్పటి నుంచి సంజీవ్ గురుగ్రామ్‌లోనే నివాసముంటున్నాడు. 2019లో వీరికి ఒక కుమారుడు జన్మించాడు. బాబు పుట్టిన తర్వాత మన్‌ప్రీత్ తన ఉద్యోగాన్ని వదిలేసింది. అయితే, గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తీవ్రస్థాయిలో మనస్పర్థలు తలెత్తాయి. తరచూ గొడవలు జరుగుతుండటంతో వీరి కాపురం వివాదాస్పదంగా మారింది. మన్‌ప్రీత్ తన భర్త నుంచి విడాకులు కూడా కోరుతోందని, ఈ క్రమంలోనే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని బంధువులు వెల్లడించారు.

కేసులో దిగ్భ్రాంతికర కోణాలు

గురువారం రోజున సంజీవ్ యాదవ్ ఇంట్లో భార్య మన్‌ప్రీత్ కౌర్ , ఏడేళ్ల కొడుకు మాత్రమే ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సంజీవ్ గదిలోని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అయితే, అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే.. తన తండ్రి ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతుండగా ఏడేళ్ల చిన్నారి తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేశాడు. అదే సమయంలో భార్య మన్‌ప్రీత్ కేకలు వేస్తూ, ఎవరైనా వచ్చి అతడిని కిందకు దించాలని అరిచింది. ఆ తర్వాతే ఆమె తన సొంత కుటుంబ సభ్యులకు , సంజీవ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి, సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందించింది.

బంధువుల తీవ్ర ఆరోపణలు

ఈ ఘటనపై సంజీవ్ సోదరి కిరణ్ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తన సోదరుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాడని స్పష్టం చేశారు. సంజీవ్ బరువు దాదాపు 100 కేజీలకు పైగా ఉంటుందని, అంత బరువున్న వ్యక్తి అంత సులభంగా ఫ్యాన్‌కు ఉరివేసుకోవడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కొడుకు చేత వీడియో తీయించడం, భార్య ప్రవర్తించిన తీరు అంతా అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. అలాగే సంజీవ్ తండ్రి రామసేవక్ యాదవ్ మాట్లాడుతూ.. తమ కోడలు మన్‌ప్రీత్ బయటి వ్యక్తులతో కలిసి కుట్ర పన్ని తమ కుమారుడిని దారుణంగా హత్య చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా సాగుతున్న వివాదమే ఈ హత్యకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.

భార్య అదుపులోకి.. పోస్టుమార్టం రిపోర్టుపైనే ఆధారపడ్డ పోలీసులు.!

సంజీవ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. సంజీవ్ భార్య మన్‌ప్రీత్ కౌర్‌ను అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. సంజీవ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసు విచారణాధికారి, సబ్-ఇన్‌స్పెక్టర్ మహేందర్ సింగ్ మాట్లాడుతూ.. "బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాం. బాలుడు తీసిన వీడియోను కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నాం. ఆ రిపోర్టు వస్తేనే ఇది ఆత్మహత్యా లేక హత్యనా అనే అసలు విషయాలు బయటకు వస్తాయి. చట్టప్రకారం తదుపరి కఠిన చర్యలు తీసుకుంటాం" అని స్పష్టం చేశారు. గురుగ్రామ్ పోలీసులు ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు.

 

Tags:    

Similar News