Woman Murder Biryani: చెన్నైలో నరరూప రాక్షసుల దారుణం.. మహిళను నరికి బిర్యానీ వండారు
Woman Murder Biryani: ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన భయానక ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.
Woman Murder Biryani
Woman Murder Biryani: చెన్నై నగరంలో మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే అత్యంత కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. తోడుగా ఉంటున్న ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన భయానక ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. మిగిలిన భాగాలను సూట్‌కేసులో ప్యాక్ చేసి రైలులో వదిలేశారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘాతుకం వెలుగుచూసింది. ఒక జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోగీలో తనిఖీలు చేపట్టిన పోలీసులు సీటు కింద ఉన్న ఎరుపు రంగు సూట్‌కేస్‌ను బయటకు తీశారు. దానిని తెరిచి చూసిన అధికారులకు వెన్నులో వణుకు పుట్టింది. అందులో ఒక మహిళ శరీర భాగాలు ముక్కలుగా నరికి ప్యాక్ చేసి ఉన్నాయి.
350 సీసీటీవీల పరిశీలన.. నిందితుల గుర్తింపు
ఆ సూట్‌కేస్ చెన్నై నుంచే రైలులోకి చేరినట్లు యూపీ పోలీసులు గుర్తించి తమిళనాడు పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 350కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక మహిళ, పురుషుడు కలిసి ఆ ఎరుపు రంగు సూట్‌కేస్‌ను తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఉంచి, ఆపై సబర్బన్ లోకల్ రైలు ఎక్కి చెన్నై శివారులోని గూడువాంచేరికి వెళ్లినట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది.
బిర్యానీ పాత్రలో శరీర భాగాలు.. పోలీసులే షాక్
పోలీసులు గూడువాంచేరిలోని అనుమానితుల ఇంటికి చేరుకుని చూసేసరికి తాళం వేసి ఉంది. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా ఇల్లంతా రక్తసిక్తంగా మారింది. వంటగదిలో దమ్ బిర్యానీ కోసం మూతపెట్టి, చుట్టూ మైదా పిండితో సీల్ చేసిన ఒక పెద్ద పాత్ర కనిపించింది. పోలీసులు అనుమానంతో ఆ పాత్ర మూత తీసి చూడగా రైస్‌తో పాటు మహిళ శరీర భాగాలు ఉడికించి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ పాత్రను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరారీలో నిందితులు.. దర్యాప్తు ముమ్మరం
హత్యకు గురైన మహిళను ఒడిశాకు చెందిన హయూత్ నిషాగా నిర్ధారించారు. భర్తతో విడిపోయిన ఆమె.. ఒడిశాకే చెందిన మాజేద్ ఉద్దిన్ లస్కర్, అతని భార్య బాగమతి మాజీలతో కలిసి గూడువాంచేరిలో నివసిస్తోంది. నిందితులు దారుణానికి ఒడిగట్టి అనంతరం పరారయ్యారు. ఏ కారణాలతో ఇంతటి క్రూరత్వానికి పాల్పడ్డారు, ఆనవాళ్లు దొరకకుండా చేసేందుకే ఇలా బిర్యానీ వండారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం హత్యకు గురైన మహిళ తల కోసం గాలిస్తూనే, పరారీలో ఉన్న నిందితుల వేట కొనసాగిస్తున్నారు. మానవత్వం ముసుగులో తిరిగే రాక్షసులు ఎంతటి దారుణానికైనా ఒడిగడతారని ఈ ఘటన నిరూపిస్తోంది. సమాజాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసిన ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.