చిలకలగూడలో దారుణం: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో నరికివేత!
హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. నడిరోడ్డుపై ఒక యువకుడిని దుండగులు అత్యంత పాశవికంగా కత్తులతో నరికి చంపారు
హైదరాబాద్‌లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. నడిరోడ్డుపై ఒక యువకుడిని దుండగులు అత్యంత పాశవికంగా కత్తులతో నరికి చంపారు. పాత కక్షలు లేదా ప్రేమ వ్యవహారమే ఈ ఘాతుకానికి ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పగతో రగిలిపోయారు
చిలకలగూడ పరిసర ప్రాంతాల్లో రాత్రి వేళ చోటుచేసుకున్న ఈ హత్యోదంతం నగరంలో సంచలనంగా మారింది. మృతుడిని లక్ష్యంగా చేసుకున్న నిందితులు, మాటు వేసి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఒక యువతి విషయంలో తలెత్తిన వివాదమే ఈ ప్రాణాలను బలిగొందని తెలుస్తోంది.
ఇద్దరు నిందితులు అదుపులోకి
ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టిన చిలకలగూడ పోలీసులు, ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పరమేష్ , వంశీ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ హత్యలో మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఉద్రిక్తంగా మారిన నామాలగుండు ప్రాంతం
హత్య వార్త తెలియగానే మృతుడి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున నామాలగుండు ప్రాంతానికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు నిందితుల ఇళ్లను ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడి పెద్దమ్మ ఇంటి వద్ద స్నేహితులు భారీగా గుమిగూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా , శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా మోహరించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిలకలగూడ పోలీసులు తెలిపారు.