Anantapur: కళ్యాణదుర్గంలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పూడ్చేసిన భార్య
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సంచలనం రేపిన భర్త హత్య కేసును పోలీసులు ఛేదించారు.
Anantapur: కళ్యాణదుర్గంలో దారుణం.. భర్తను చంపి ఇంట్లో పూడ్చేసిన భార్య
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాతచెరువు గ్రామానికి చెందిన బోయ సుకన్య (34)ను అరెస్ట్ చేయగా, ఆమె మైనర్ కుమార్తెను (CCL) అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ నెంబర్ 33/2026 కింద నమోదైన ఈ కేసులో డీఎస్పీ పి. రవిబాబు ఆదేశాల మేరకు సీఐ పి. గణేష్ నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టి నిందితులను మల్లాపురం క్రాస్ వద్ద అదుపులోకి తీసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం… సుకన్యకు సుమారు 17 సంవత్సరాల క్రితం బోయ హనుమంతుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కొంతకాలంగా హనుమంత మద్యం అలవాటు పడి భార్యపై అనుమానం పెంచుకోవడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేయాలని సుకన్య ముందుగానే యోచించినట్లు పోలీసులు తెలిపారు.
గత సంవత్సరం నవంబర్ 10వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే రాత్రి తెల్లవారుజామున కోపోద్రిక్తురాలైన సుకన్య, ఇంట్లో ఉన్న రోకలిబండతో భర్త తలపై పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని ఇంటి పక్కనే గుంత తవ్వి పూడ్చిపెట్టి,రక్తపు ఆనవాళ్లను శుభ్రం చేసి ఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించింది.
హనుమంత కనిపించడంలేదని బంధువులు ప్రశ్నించగా, కూలి పనికి వెళ్లి తిరిగి రాలేదని సుకన్య తప్పుదారి పట్టించింది. అయితే ఇటీవల కుమార్తెతో జరిగిన వివాదం సమయంలో అసలు విషయం బయటపడటంతో మృతుడి తండ్రి లక్ష్మన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, మార్చి 29న అధికారుల సమక్షంలో శవాన్ని వెలికితీశారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం అమరావతి ల్యాబ్‌కు పంపిన ఎముకల నమూనాలు హనుమంతవేనని నిర్ధారణ కావడంతో కేసు మలుపుతిరిగింది.
నిందితులను అరెస్ట్ చేసి విచారణ కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన సీఐ గణేష్ మరియు పోలీసు సిబ్బందిని డీఎస్పీ రవిబాబు అభినందించారు. ఈ ఘటన కళ్యాణదుర్గం ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.