Punganur: నల్లారి కిరణ్, కిషోర్‌లను కలిసిన టీడీపీ ఇన్‌చార్జ్
Punganur: పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డిని కలిశారు. గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.
Punganur: నల్లారి కిరణ్, కిషోర్‌లను కలిసిన టీడీపీ ఇన్‌చార్జ్
పుంగనూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
పుంగనూరు నియోజకవర్గ నూతన ఇన్‌చార్జ్ గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ నాయుడు, పుంగనూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సోమవారం పీలేరు నియోజకవర్గం కలికిరి నగిరిపల్లి లోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక మహాశక్తి అని, ఆయన అనుభవం, విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నారని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరి సలహాలు, సూచనలు తీసుకునేవారు కాదని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమేనని, జాతీయ స్థాయితోపాటు ప్రపంచంలోనే రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చారని, కాబట్టి ఆయన సూచనల మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
పుంగనూరు నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. త్వరలో రాబోయే మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలకు ప్రతి ఒక్కరూ ఇప్పటి నుండే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తెలుగు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతానని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
అనంతరం నూతన ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ.. మండలాల వారీగా అందరితో సమావేశమై పరిచయాలు పెంచుకుంటానని, గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరితో కలిసి పనిచేస్తానని తెలిపారు. రాబోయే మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గాన్ని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.