Plastic Currency : ఇక చిరిగిపోవు.. మురికి కావు.. త్వరలోనే మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు

Plastic Currency : భారతదేశంలో కాగితం కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ఆర్‌బీఐ కసరత్తు చేస్తోంది. నోట్ల ముద్రణ ఖర్చు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం.

Update: 2026-05-29 04:15 GMT

Plastic Currency 

Plastic Currency : మీ జేబులో ఉండే కాగితం నోట్లు త్వరలోనే చరిత్రగా మారిపోనున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నగదు డిమాండ్, నోట్ల తయారీ ఖర్చులను తగ్గించుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. ఇకపై దేశంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇటీవల పాట్నా, ముంబై నగరాల్లో జరిగిన ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశాల్లో ఈ అంశంపైనే సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కాగితం నోట్లు త్వరగా పాడైపోతుండటంతో.. వాటి స్థానంలో లైఫ్ ఎక్కువగా ఉండే ప్లాస్టిక్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

ఆర్‌బీఐ విడుదల చేసిన ఆర్థిక సంవత్సరం 2025 వార్షిక నివేదిక ప్రకారం.. దేశంలో కాగితం నోట్లను ముద్రించడానికి కేంద్ర బ్యాంకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు రూ. 5,101.4 కోట్లు ఖర్చు అవ్వగా.. ఈసారి అది ఏకంగా రూ. 6,372.8 కోట్లకు పెరిగిపోయింది. మార్కెట్లో నగదుకు విపరీతమైన డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, కాగితంతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు అయ్యే ఖర్చు దీర్ఘకాలంలో చాలా తక్కువని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఏటీఎం మిషన్లు కూడా ఎంతో అడ్వాన్స్‌డ్‌గా మారాయని, ఈ ప్లాస్టిక్ నోట్లను సులభంగా గుర్తించి బయటకు పంపే సాంకేతికత వాటిలో ఉందని ఆర్‌బీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

సాధారణంగా మన చేతుల్లోకి వచ్చే కాగితం నోట్లు త్వరగా మురికిగా మారడం లేదా చిరిగిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి పాడైపోయిన కరెన్సీ నోట్లను సేకరించి, వాటిని నాశనం చేయడం ఆర్‌బీఐకి ప్రతి ఏటా పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఒక్క 2025 ఆర్థిక సంవత్సరంలోనే ఆర్‌బీఐ దాదాపు 23.8 బిలియన్ల పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుని ధ్వంసం చేసింది. గత ఏడాదితో (21.24 బిలియన్లు) పోలిస్తే ఇది 12.3 శాతం ఎక్కువ. ఇలా రద్దయిన నోట్లలో ఎక్కువ శాతం రూ.500, రూ.100 నోట్లే ఉన్నాయి.

దేశంలో డిజిటల్ పేమెంట్లు ఊపందుకున్నప్పటికీ, చేతిలో నగదు ఉంచుకోవాలనే జనం క్రేజ్ అస్సలు తగ్గలేదు. మే 15 నాటికి మార్కెట్లో చలామణిలో ఉన్న మొత్తం నగదు విలువ ఏటా 11.5 శాతం వృద్ధితో రూ. 42.86 లక్ష కోట్ల రికార్డు స్థాయికి చేరింది. కాగితం నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్ల ఆయుష్షు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పదే పదే కొత్త నోట్లను ముద్రించాల్సిన అవసరం ఆర్‌బీఐకి తప్పుతుంది.

మార్కెట్లో రూ.10, రూ.20 వంటి చిన్న నోట్లకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. అయితే మొత్తం కరెన్సీలో వీటి వాటా కేవలం ఒక శాతం కంటే తక్కువే. గతంలో నాణేల చలామణిని పెంచాలని ఆర్‌బీఐ చూసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. నిజానికి 2012 సంవత్సరంలోనే అప్పటి ప్రభుత్వం దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో రూ.10 విలువైన ఒక బిలియన్ ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. కానీ అప్పట్లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు ఒక దశాబ్దం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ కావడంతో పాత సమస్యలన్నీ తీరిపోయాయని, అందుకే ప్లాస్టిక్ నోట్ల వైపు ఆర్‌బీఐ మొగ్గు చూపుతోందని అధికారులు అంటున్నారు.

కరెన్సీ నోట్లకు ప్లాస్టిక్ ఉపయోగించడం ప్రపంచ దేశాలకు కొత్తేమీ కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలు ఈ పాలిమర్ బ్యాంక్ నోట్లను విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుకు 1988 లోనే ఆస్ట్రేలియా శ్రీకారం చుట్టింది. ఆస్ట్రేలియా మొదటిసారిగా 10 డాలర్ల ప్లాస్టిక్ నోటును ముద్రించింది. ఆ తర్వాత సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి ఆసియా దేశాలు కూడా దీనిని ఫాలో అయ్యాయి.

యూరప్ ఖండంలో 1998 లో రొమేనియా దేశం మొదటిసారిగా ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టగా, కెనడా 2011 లో దీనిని అమల్లోకి తెచ్చింది. అయితే, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికన్ డాలర్ మాత్రం పూర్తిగా ప్లాస్టిక్ కాదు. డాలర్ నోట్లను కాటన్ మరియు లినన్ లతో కూడిన ఒక ప్రత్యేకమైన మిశ్రమంతో తయారు చేస్తారు. ఇప్పుడు అదే బాటలో మన భారత్‌లో కూడా ప్లాస్టిక్ నోట్లు వస్తే కరెన్సీ కష్టాలన్నీ తీరిపోతాయని ఆర్‌బీఐ ఆశాభావంతో ఉంది.

Tags:    

Similar News