Royal Enfield: కొత్త కలర్స్, అదిరిపోయే ఫీచర్లు.. సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లాంచ్
Royal Enfield: ప్రసిద్ధ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లోకి కొత్త వర్షన్ కాంటినెంటల్ GT 650 బైక్‌ను విడుదల చేసింది.
Royal Enfield continental GT 650
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్లకు కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తన పాపులర్ 650cc కేఫ్ రేసర్ మోడల్ కాంటినెంటల్ GT 650 బైక్‌ను కొత్త కలర్ ఆప్షన్లు, సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. బైకర్ల అవసరాలకు అనుగుణంగా ఇందులో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 3.58 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 3.88 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
డిజైన్‌లో కీలక మార్పులు
2026 కాంటినెంటల్ GT 650 బైక్‌లో బ్లాక్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కవర్‌తో పాటు సరికొత్త ఎల్‌ఈడీ ఇండికేటర్లను అమర్చారు. లాంగ్ రైడింగ్ చేసే బైకర్ల సౌకర్యార్థం యూఎస్‌బీ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ప్రయాణంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్లను సులభంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. రాకర్ రెడ్ వేరియంట్‌లో ఇప్పుడు బ్లాక్ ఇంజన్, బ్లాక్ ఎగ్జాస్ట్, కాస్ట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.
నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యం
ఈ నయా బైక్ మొత్తం నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది. రాకర్ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ వేరియంట్ల ధర రూ.3.58 లక్షలుగా ఉంది. బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ వేరియంట్‌లో పాలిష్ చేసిన ఇంజన్, స్పోక్ వీల్స్ యథాతథంగా కొనసాగుతున్నాయి. బ్లాక్ ఇంజన్, అల్లాయ్ వీల్స్‌తో వచ్చే అపెక్స్ గ్రే వేరియంట్ ధర రూ.3.81 లక్షలు కాగా, పాలిష్డ్ ఇంజన్ ఫినిషింగ్‌తో ఉండే టాప్ వేరియంట్ మిస్టర్ క్లీన్ ధర రూ.3.88 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
పవర్‌ఫుల్ ఇంజన్ సామర్థ్యం
లుక్, ఫీచర్ల పరంగా మార్పులు చేసినప్పటికీ, మెకానికల్ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో మునుపటిలాగే 648 సిసి ఎయిర్/ఆయిల్-కూల్డ్ ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ 47 హెచ్‌పి పవర్, 52.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించడం వల్ల బైక్ వేగంగా దూసుకెళ్తుంది.
మిడ్-సైజ్ పెర్ఫార్మన్స్ బైక్ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లు, క్లాసిక్ కేఫ్ రేసర్ లుక్ కలబోతగా వచ్చిన ఈ బైక్ కుర్రకారును మరింతగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.