Maruti Baleno: సన్‌రూఫ్, అదిరిపోయే లుక్..సెప్టెంబర్ 5న రోడ్డెక్కనున్న మారుతి కొత్త కారు
Maruti Baleno: సరికొత్త ఫీచర్లు, అట్రాక్టివ్ డిజైన్‌తో వస్తున్న మారుతి బలేనో ఫేస్‌లిఫ్ట్ పండుగల సీజన్ కంటే ముందే లాంచ్ కావడం విశేషం.
Maruti Baleno
Maruti Baleno: భారతీయ కార్ లవర్స్ మనసు దోచుకున్న మారుతి సుజుకి బాలెనో మరో కొత్త రూపంలో మెరిసేందుకు సిద్ధమైంది. సన్‌రూఫ్, అంబియంట్ లైటింగ్, సరికొత్త ఫ్రంట్ డిజైన్‌తో సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వివరాలు కార్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తిరుగులేని రాజాలా ఏలుతున్న మారుతి బాలెనో ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతోంది. 2022లో వచ్చిన సెకండ్ జనరేషన్ మోడల్‌కు కొనసాగింపుగా ఈ నయా అప్‌డేట్‌ను తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 5న అధికారికంగా మార్కెట్‌లోకి ప్రవేశించనున్న ఈ కారు టెస్టింగ్ చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సరికొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్‌తో ముందు భాగం చాలా స్పోర్టీగా కనిపిస్తోంది. హెడ్‌లాంప్‌లను కలిపేలా మధ్యలో అందించిన క్రోమ్ ఎలిమెంట్ ఈ కారుకు ప్రీమియం లుక్‌ను జోడిస్తోంది.
ఆకట్టుకునే ఇంటీరియర్.. సన్‌రూఫ్ హంగామా
కొత్త బాలెనో కేబిన్ లోపల కూడా కొన్ని కీలకమైన మార్పులు చేశారు. ఈ విభాగంలో ఇతర పోటీ కార్లకు గట్టి సవాలు విసిరేలా మొదటిసారిగా సింగిల్ ప్యాన్ సన్‌రూఫ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. దీనితో పాటు కేబిన్ వాతావరణాన్ని మార్చేసేలా అంబియంట్ లైటింగ్, నయా సీట్ అపోల్స్టరీని జోడించారు. డాష్‌బోర్డ్ లేఅవుట్ పాత మోడల్ మాదిరిగానే 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6-స్పికర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMస్ వంటి ఫీచర్లు ఇందులో కొనసాగుతున్నాయి.
ఇంజిన్ సామర్థ్యం.. గేర్‌బాక్స్ వివరాలు
ఇంజిన్ విభాగంలో మార్పులు లేకుండా పాత పవర్‌ట్రెయిన్‌నే మారుతి కొనసాగించనుంది. 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 90 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. సిఎన్‌జీ వేరియంట్‌లో ఇదే ఇంజిన్ 77.5 హెచ్‌పీ పవర్‌ను ఇస్తూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మార్కెట్‌లోకి రానుంది. ఇంధన పొదుపులో మెరుగైన మైలేజ్ ఇచ్చే ఈ ఇంజిన్ మిడిల్ క్లాస్ వినియోగదారులకు బాగా కలసివచ్చే అంశం.
సైడ్ ప్రొఫైల్.. కొత్త అలాయ్ వీల్స్
కారు సైడ్ ప్రొఫైల్ చూస్తే పెద్దగా మార్పులు కనిపించకపోయినా, నయా డిజైన్ అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వెనుక వైపు నయా డిజైన్ బంపర్‌ను చేర్చారు. టెయిల్-లాంప్స్, రూఫ్ స్పోయిలర్, రియర్ వైపర్ పాత వెర్షన్ మాదిరిగానే కొనసాగుతాయి. మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, బాలెనో సేల్స్ తగ్గకపోవడం దీని ప్రాచుర్యానికి నిదర్శనం. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ రాకతో మారుతి సేల్స్ మరింత పుంజుకుంటాయని ఆటోమొబైల్ విశ్లేషకులు భావిస్తున్నారు.