Car Tyre Numbers Explained: కారు టైర్లపై ఉండే నంబర్ల అర్థం తెలుసా..? ఈ సీక్రెట్ కోడ్ వెనుక ఉన్న రహస్యమిదే!
Car Tyre Numbers Explained: కారు నిర్వహణలో అత్యంత కీలకమైన భాగం టైర్లు మాత్రమే. రోడ్డుతో నేరుగా సంబంధం కలిగి ఉండేది ఇవే. ఇంజిన్, మైలేజ్ పట్ల చూపించే శ్రద్ధలో సగం కూడా చాలామంది టైర్ల మీద చూపించరు.
Car Tyre Numbers Explained: కారు టైర్లపై ఉండే నంబర్ల అర్థం తెలుసా..? ఈ సీక్రెట్ కోడ్ వెనుక ఉన్న రహస్యమిదే!
Car Tyre Numbers Explained: నిత్యం కారులో ప్రయాణిస్తుంటాం. రోజూ టైర్లను చూస్తుంటాం. కానీ వాటి పక్కన ముద్రించిన నంబర్లు, అక్షరాలను ఎప్పుడైనా గమనించారా? ఆ సీక్రెట్ కోడ్ వెనుక మీ కారు భద్రతకు సంబంధించిన ఓ పెద్ద రహస్యం దాగి ఉంది. మీ వాహనానికి సరైన టైరును ఎంచుకోవడానికి, ప్రమాదాల నుంచి కాపాడటానికి ఉపయోగపడే ఆ సంకేతాల అసలు అర్థమిదే..!
కారు నిర్వహణలో అత్యంత కీలకమైన భాగం టైర్లు మాత్రమే. రోడ్డుతో నేరుగా సంబంధం కలిగి ఉండేది ఇవే. ఇంజిన్, మైలేజ్ పట్ల చూపించే శ్రద్ధలో సగం కూడా చాలామంది టైర్ల మీద చూపించరు. టైర్లు అరిగిపోయిన వెంటనే షాపుకు వెళ్లి వ్యాపారి చేతికి చిక్కినదల్లా వేయించేసుకుంటారు. కారుకు ఏ టైరు సరిపోతుందో, ఏది వేస్తే మెరుగైన రోడ్ గ్రిప్ వస్తుందో తెలుసుకోవడం మన బాధ్యత. దీనికి మీరు ఆటోమొబైల్ ఇంజినీర్ కావాల్సిన పనిలేదు. టైరు పక్కభాగంలో (సైడ్‌వాల్) ముద్రించిన ఆ కోడ్ చదవడం వస్తే చాలు.
ఉదాహరణకు మీ కారు టైరు మీద 165/65R14 79T అని రాసి ఉందనుకుందాం. చూడటానికి ఇదిదో మ్యాథ్స్ ఫార్ములా లాగా అనిపించవచ్చు. ఇందులో ఏముందిలే అని తీసిపారేయకండి. ఇందులో దాగి ఉన్న ప్రతి అక్షరానికి, ప్రతి సంఖ్యకూ మీ భద్రతతో నేరుగా సంబంధం ఉంది. ఆ నంబర్లు ఏం చెబుతున్నాయో విడివిడిగా తెలుసుకుందాం.
టైరు వెడల్పు, ఎత్తును సూచించే సంఖ్యలు..
ఆల్ఫా-న్యూమరిక్ కోడ్‌లో మొదటగా కనిపించే '165' అనే నంబర్ టైరు వెడల్పును సూచిస్తుంది. ఒక టైరు ఒక అంచు నుంచి మరొక అంచు వరకు ఎంత వెడల్పు ఉందో మిల్లీమీటర్లలో కొలిచి ఇక్కడ ముద్రిస్తారు. కారు రోడ్డుపై స్థిరంగా వెళ్లడానికి సరైన వెడల్పు చాలా అవసరం. ఆ పక్కనే ఒక స్లాష్ (/) గుర్తు తర్వాత ఉండే '65' అనే నంబర్ టైరు ఎత్తును, అనగా యాస్పెక్ట్ రేషియోను తెలియజేస్తుంది. అంటే టైరు వెడల్పులో దాని ఎత్తు సరిగ్గా 65 శాతం ఉందన్నమాట. ఈ నిష్పత్తి బ్యాలెన్స్‌డ్‌గా ఉంటేనే కుదుపులు లేని సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది.
అంతర్గత నిర్మాణం, వీల్ రిమ్ సైజు..
ఈ నంబర్ల తర్వాత కనిపించే ఆంగ్ల అక్షరం 'R' టైరు తయారీ విధానాన్ని వివరిస్తుంది. టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఇది 'రేడియల్' నిర్మాణంతో రూపొందిన టైరు. నేటితరం కార్లన్నింటికీ ఈ రేడియల్ టైర్లనే వినియోగిస్తున్నారు. ఆ పక్కనే ఉండే నంబర్ '14' అత్యంత కీలకమైనది. ఇది టైరు లోపలి వ్యాసాన్ని అంగుళాల్లో కొలుస్తుంది. మీరు ఎప్పుడైనా కారుకు అధునాతన అల్లాయ్ వీల్స్ వేయించాలనుకుంటే ఈ నంబర్ కచ్చితంగా గుర్తుంచుకోవాలి. సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఇది మీ కారు వీల్ రిమ్ సైజును చెబుతుంది.
బరువు మోసే సత్తా, స్పీడ్ కంట్రోల్ హెచ్చరిక..
ఆఖరులో ఉండే అక్షరాలు టైరు పనితీరుకు, మీ ప్రాణ రక్షణకు గీటురాయి లాంటివి. అందులో '79' అనే నంబర్ టైరు బరువు మోసే సామర్థ్యాన్ని (లోడ్ ఇండెక్స్) స్పష్టం చేస్తుంది. కారులో పూర్తిస్థాయిలో లగేజీ, ప్రయాణికులు ఉన్నప్పుడు ఆ టైరు ఎంత బరువును సురక్షితంగా మోయగలదో దీని ద్వారా తెలుసుకోవచ్చు. కారు బరువును బట్టి ఈ రేటింగ్ మార్చుకోవాల్సి ఉంటుంది.
చివరిగా ఉండే ఆంగ్ల అక్షరం 'T' టైరు గరిష్ఠ వేగ పరిమితికి సంబంధించిన పక్కా హెచ్చరిక. కారులో పూర్తిగా బరువు లోడ్ చేసిన తర్వాత ఆ టైరుతో ఎంత వేగంతో వెళ్లొచ్చో ఈ స్పీడ్ సింబల్ కచ్చితంగా చెబుతుంది. ఒక్కో అక్షరానికి ఒక్కో నిర్దిష్టమైన వేగ పరిమితి ఉంటుంది. ఒకవేళ మీ టైరుపై 'V' అని ముద్రించి ఉంటే అది గంటకు గరిష్ఠంగా 240 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోగలదు. అదే 'U' అని ఉంటే గంటకు 200 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్లాలని అర్థం. ఈ పరిమితిని దాటి స్పీడ్ పెంచితే టైరు పేలిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లే.
టైర్లపై ఉండే ఈ చిన్న అక్షరాలే మీ ప్రాణాలకు రక్ష కవచాలు. ఇకపై కారుకు కొత్త టైర్లు కొనే సమయంలో ఈ కోడ్‌ను క్షుణ్ణంగా చదివి మీ అవసరాలకు తగిన టైరును మాత్రమే ఎంచుకోండి. సరైన అవగాహనతో నిర్ణయం తీసుకుని, మీ కుటుంబ ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చుకోండి.