Hero: డెలివరీ బాయ్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే హీరో బైక్‌లు

Hero: ఫుడ్ డెలివరీ రంగంలో రాత్రింబవళ్లు కష్టపడే డెలివరీ పార్టనర్లకు ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్, స్విగ్గీ సంస్థలు అద్భుతమైన అవకాశం కల్పించాయి.

Update: 2026-09-03 04:03 GMT

Hero MotoCorp

Hero: ఎండనకా, వాననకా నిరంతరం రోడ్లపై తిరిగే స్విగ్గీ ఫుడ్, ఇన్‌స్టామార్ట్ డెలివరీ ఏజెంట్లకు సొంత వాహనం కొనుగోలు చేయడం ఇక ఎంతగానో సులభతరం కానుంది. హీరో మోటోకార్ప్‌కి చెందిన అన్ని రకాల మోటార్‌సైకిళ్లపై స్విగ్గీ రైడర్లకు ప్రత్యేక తగ్గింపు ధరలు లభిస్తాయి. వాహనం ఖరీదులో దాదాపు 90 శాతం వరకు రుణం పొందే వెసులుబాటు కల్పించారు. సులువైన వాయిదాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో సొంత బైక్ కల నెరవేర్చుకునేందుకు ఈ పథకం దోహదపడుతుంది.

కేవలం బైక్‌లు చౌకగా ఇవ్వడమే కాకుండా, రైడర్ల సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. గురుగ్రామ్‌లోని హీరో మోటోకార్ప్ ట్రాఫిక్ ట్రైనింగ్ పార్క్‌లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డెలివరీ బాయ్స్‌కు ఫుల్ ఫేస్ హెల్మెట్, మెడికల్ కిట్, రిఫ్లెక్టివ్ సేఫ్టీ జాకెట్, సర్టిఫికేట్‌తో కూడిన ప్రత్యేక రోడ్డు సేఫ్టీ కిట్‌ను అందించారు. రైడ్ సేఫ్ ఇండియా నినాదంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో స్విగ్గీ రైడర్లకు ఉచిత సురక్షిత ప్రయాణ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

స్విగ్గీ డెలివరీ పార్టనర్లు తమ సొంత డెలివరీ యాప్ ద్వారానే తమకు నచ్చిన హీరో బైక్ మోడల్‌ను ఎంచుకోవచ్చు. సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి నేరుగా ఈ ప్రత్యేక డిస్కౌంట్లు, ఫైనాన్స్ ప్రయోజనాలు పొందవచ్చు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సులభంగా ముగిసేలా యాప్‌లో ప్రత్యేక వ్యవస్థను సమకూర్చారు. ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ టీం కూడా అందుబాటులో ఉంటుంది.

సొంత వాహనం అందుబాటులోకి వస్తే డెలివరీ పార్టనర్ల ప్రయాణం సులభతరం కావడమే కాకుండా వారి రోజువారీ సంపాదన గణనీయంగా పెరుగుతుందని స్విగ్గీ, హీరో మోటోకార్ప్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని స్పష్టం చేశారు.  

Tags:    

Similar News