Renault: ఒకేసారి 5 కొత్త కార్లు.. ఇండియన్ మార్కెట్‌లో రెనాల్ట్ ఊచకోత
Renault: భారతీయ వాహన ప్రియులను అలరించేందుకు ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ సిద్ధమైంది.
Renault
Renault: భారతీయ వాహన ప్రియులను అలరించేందుకు ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో ఏకంగా 5 కొత్త ఎస్‌యూవీలు, ఎమ్‌పివిలను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటిలో మైలేజ్ ఇచ్చే సిఎన్‌జి మోడళ్ల నుంచి పవర్ఫుల్ డస్టర్ హైబ్రిడ్, 7 సీటర్ బోరియల్ ఎస్‌యూవీ వరకు ఉండటం విశేషం.
పవర్ఫుల్ అవతారంలో రెనాల్ట్ ట్రైబర్ టర్బో
కుటుంబ సమేతంగా ప్రయాణించే వారికి ఎంతో ఇష్టమైన రెనాల్ట్ ట్రైబర్ మోడల్ త్వరలోనే పవర్ఫుల్ టర్బో ఇంజిన్‌తో సందడి చేయనుంది. ప్రస్తుతం ఉన్న 71 హార్స్ పవర్ సాధారణ ఇంజిన్ స్థానంలో 100 పిఎస్ పవర్, 160 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. ఇది వాహనానికి మెరుగైన వేగాన్ని ఇస్తుంది. ప్రారంభంలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు, ఆ తర్వాత ఆటోమేటిక్ ఆప్షన్‌లోనూ అందుబాటులోకి రానుంది.
సూపర్ మైలేజ్ ఇచ్చే టర్బో సిఎన్‌జి మోడళ్లు
రెనాల్ట్ కంపెనీ తన ప్రజాదరణ పొందిన ట్రైబర్, కైగర్ కార్లలో అత్యంత ఆధునిక ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‌జి టెక్నాలజీని పరిచయం చేయబోతోంది. కొత్త ఆర్జిఇపి ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారయ్యే ఈ కార్లలో డ్యూయల్-సిలిండర్ సిఎన్‌జి సెటప్‌ను కారు అడుగు భాగంలో అమరుస్తారు. దీనివల్ల బూట్ స్పేస్ తగ్గే సమస్యే ఉండదు. మైలేజ్ కోరుకునే వారికి, రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవాలనుకునే వారికి ఈ టర్బో పెట్రోల్ సిఎన్‌జి కాంబినేషన్ అద్భుతమైన ఎంపికగా మారనుంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ఇవి మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
కొత్త రూపుతో తిరిగొస్తున్న రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్
భారతీయ రోడ్లపై ఒకప్పుడు ఏలిన ఐకానిక్ బ్రాండ్ డస్టర్ మళ్లీ సరికొత్త సస్పెన్షన్‌తో రాబోతోంది. ఈ సారి కంపెనీ దీనిని ఈ-టెక్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో తీసుకొస్తోంది. ఇందులో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి కలిసి సుమారు 160 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీపావళి నాటికి ఈ పవర్‌ఫుల్ హైబ్రిడ్ ఎస్‌యూవీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీ 7-సీటర్ ఎస్‌యూవీ రెనాల్ట్ బోరియల్
రెనాల్ట్ తీసుకువస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో బోరియల్ అత్యంత ప్రత్యేకమైనది. డస్టర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్న ఈ 3-రో 7-సీటర్ ఎస్‌యూవీ 4.56 మీటర్ల పొడవు, 213 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో రానుంది. ఇందులో 586 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 156 నుంచి 160 బిహెచ్‌పి పవర్ ఇస్తుంది. దీని ధర రూ.13 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.