Renault Kwid: సరికొత్త లుక్‌తో మెరిసిపోతున్న రెనాల్ట్ హ్యాచ్‌బ్యాక్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అంతే
Renault Kwid: చిన్న కార్ల విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రెనాల్ట్ క్విడ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ బ్రెజిల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది.
Renault Kwid
Renault Kwid: చిన్న కార్ల విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రెనాల్ట్ క్విడ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కంపెనీ బ్రెజిల్ మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. సరికొత్త డిజైన్, హంగులతో రూపుదిద్దుకున్న ఈ హ్యాచ్‌బ్యాక్, ఇంటీరియర్‌లో ఊహించని ప్రీమియం ఫీచర్లతో ఆటోమొబైల్ లవర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొత్త రెనాల్ట్ క్విడ్ కెబిన్ విషయంలో కంపెనీ భారీ మార్పులు చేసింది. డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఏకంగా 10.1 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 7 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను అమర్చారు. మన దేశంలో లభించే మోడల్‌లో 8 అంగుళాల స్క్రీన్, సెమీ డిజిటల్ కన్సోల్ మాత్రమే ఉంటాయి. కొత్త లగ్జరీ కార్లకు పోటీగా దీని ఇంటీరియర్‌ను బ్రెజిల్ వర్షెన్‌లో డిజైన్ చేయడం విశేషం.
ఆకట్టుకునే ఎక్స్‌టీరియర్ మార్పులు
బ్రెజిల్‌లో విడుదలైన ఈ కొత్త క్విడ్‌ను ఇవాల్యుయేషన్, టెక్నో, అవుట్‌సైడర్ అనే మూడు వెరియంట్లలో తీసుకొచ్చారు. ముందు భాగంలో నిలువు గీతలతో కూడిన కొత్త గ్రిల్, మధ్యలో మెరిసే నయా త్రీడీ రెనాల్ట్ లోగోను పొందుపరిచారు. హాలోజెన్ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ బార్లు మునుపటిలాగే కొనసాగుతున్నప్పటికీ, కొత్త డిజైన్ అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్ల రూపురేఖలను సవరించి కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇచ్చారు.
అద్భుతమైన ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు
ప్రయాణికుల భద్రతకు ఈ కారులో పెద్దపీట వేశారు. 4 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఏబీఎస్, ఈబీడీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా అందించారు. రెండు టైప్-సి ఛార్జింగ్ పోర్టులు, పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్లు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
పవర్‌ఫుల్ ఇంజిన్, బూట్ స్పేస్ వివరాలు
ఈ హ్యాచ్‌బ్యాక్ 2423 మిల్లీమీటర్ల వీల్‌బేస్, 185 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. 290 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తున్నారు. ఇది భారతీయ మోడల్ కంటే 11 లీటర్లు అదనంగా ఉండటం విశేషం. 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇథనాల్ ఇంధనంతో 71 హార్స్ పవర్, పెట్రోల్‌తో 68 హార్స్ పవర్ శక్తిని ఈ ఇంజిన్ విడుదల చేస్తుంది.