Daily Horoscope: వృద్ధి యోగంతో ఈరోజు పైచేయి సాధించే రాశులు ఇవే
వృద్ధి యోగం ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఎవరికి అనుకూలంగా ఉంటుంది, పరిహారాలు ఏంటో తెలుసుకుందాం.
Daily Horoscope: అధిక జ్యేష్ట మాస శుక్ల పక్ష పంచమి తిథి ఈ రోజు ఉదయం 08.26 గంటల వరకు కొనసాగి, అనంతరం షష్ఠి తిథి ప్రారంభమవుతోంది. పుష్యమి నక్షత్రం రాత్రి 02.49 వరకు ఉండి, తర్వాత ఆశ్లేష నక్షత్ర ప్రభావం మొదలవుతుంది. ఉదయం 10.58 వరకు గండ యోగం ఉండగా, ఆ తర్వాత వృద్ధి యోగం ప్రారంభమవుతోంది. బాలవ కరణం ఉదయం 08.26 వరకు, కౌలవ కరణం సాయంత్రం 07.20 వరకు కొనసాగనున్నాయి. ఈ రోజు ఆధ్యాత్మిక సాధనలు, దేవాలయ దర్శనాలు, కుటుంబ శుభకార్యాల ప్రారంభానికి అనుకూలమైన రోజు అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గురువారం కావడంతో శ్రీ మహావిష్ణు, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎంతో మంగళకరంగా భావించబడుతోంది.
మేషరాశి
మేష రాశి వారికి ఈ రోజు అదృష్టం అనుకూలంగా కనిపిస్తోంది. ఉద్యోగ రంగంలో మీ కృషికి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా ప్రశంసలు రావచ్చు. వ్యాపారస్తులు కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తే మంచి లాభాలు పొందగలరు. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక బలం ఇస్తుంది. ఆర్థికంగా కూడా అభివృద్ధి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భగవంతునిపై విశ్వాసంతో ప్రారంభించిన పనులు సాఫీగా పూర్తవుతాయి. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయడం మంచిది.
వృషభరాశి
ఈ రోజు వృషభ రాశి వారికి అభివృద్ధి దిశగా అడుగులు పడే రోజు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కళారంగం ఇలా ఏ రంగంలో ఉన్నా శుభవార్తలు వినే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో తెలివితేటలు స్పష్టంగా కనిపిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అయితే అనవసరమైన వాదనలు దూరంగా ఉంచడం మంచిది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఈరోజు ఈరాశివారు శక్తిని ఆరాధించాలి.
మిథునరాశి
మిథున రాశి వారికి ఈ రోజు ఉత్సాహభరితంగా ఉంటుంది. మానసిక ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో గౌరవం మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటిస్తే భవిష్యత్తులో మంచి స్థిరత్వం వస్తుంది. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు వచ్చినా పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఈరోజు ఈరాశివారు సూర్యుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
కర్కాటకరాశి
కర్కాటక రాశి వారు పట్టుదలతో ముందుకెళితే విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు పెరుగుతాయి. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడిపే సమయం లభిస్తుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించడం శుభకరం.
సింహరాశి
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడి ఉండొచ్చు. కానీ సమయపాలన పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. వ్యాపారంలో కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు ఈరాశివారు పంచముఖ ఆంజనేయుడిని దర్శించుకోవాలి.
కన్యారాశి
కన్య రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సులభంగా పూర్తవుతాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త అందరినీ సంతోషపరుస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని ఆరాధించాలి.
తులారాశి
తులా రాశి వారికి ఈ రోజు పురోగతిని తీసుకొచ్చే రోజు. ఆర్థికాభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తీసుకునే ధైర్య నిర్ణయాలు విజయానికి దారితీస్తాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరుగుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు అనుకూలంగా మారుతాయి. ఈరోజు ఈరాశివారు కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడం శ్రేయస్కరం.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం రెండింట్లోనూ విజయ సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాలు సంతోషాన్ని ఇస్తాయి. అధికారులు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేసేలా ఉంటాయి. బంధుమిత్రులతో చేసే ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈరాశివారు దత్తాత్రేయుడిని ఆరాధించడం వలన మేలు జరుగుతుంది.
ధనస్సురాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితం లభించినా ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నచిన్న విభేదాలు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు ఆదిత్యహృదయం పారాయణం చేయడం వలన మేలు జరుగుతుంది.
మకరరాశి
మకర రాశి వారికి ఈ రోజు బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేసే రోజు. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో క్లిష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. నూతన వాహన యోగం కనిపిస్తోంది. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ఈరాశివారు దుర్వాగణపతిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు పొందుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ రోజు శ్రమతో కూడుకున్నప్పటికీ ఫలప్రదంగా ఉంటుంది. కుటుంబ ఆస్తుల పెరుగుదలపై ఆలోచనలు చేస్తారు. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. ఈరోజు ఈరాశివారు నవగ్రహారాధన చేయడం వలన మానసికంగా ధైర్యాన్ని పొందుతారు.
మీనరాశి
మీన రాశి వారికి ఈ రోజు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. బంధుమిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందకర సమయం గడుపుతారు. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.
గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవే. ఎవరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఇచ్చినవి కావు.