AP Land Reforms 2026 : ఏపీలో భూ విప్లవం.. కోటి మందికి పైగా యజమానులకు చంద్రన్న పట్టా కానుక

AP Land Reforms 2026 : ఏపీలో భూ వివాదాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు. కోటి మందికి పైగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు, ఇనాం భూములకు విముక్తి, రికార్డుల భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ.

Update: 2026-04-09 03:47 GMT

Chandrababu Naidu

AP Land Reforms 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల విషయంలో నెలకొన్న ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో దాదాపు 75 లక్షల కుటుంబాలకు మేలు చేకూరేలా కీలక ప్రకటనలు చేశారు. భూ వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టి, సామాన్యుడి ఆస్తికి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

భూ హక్కుల పంపిణీకి డెడ్ లైన్

గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల విషయంలో జరిగిన గందరగోళాన్ని తొలగించేందుకు రీ-సర్వే 2.0ను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై నాటికి ఇప్పటికే సర్వే పూర్తయిన 1,259 గ్రామాల్లో 9 లక్షల పాసు పుస్తకాలు అందజేస్తారు. 2027 మార్చి లోపు రాష్ట్రంలోని అర్హులైన వారందరికీ కొత్త పాసు పుస్తకాలు అందజేసేలా నెలవారీ లక్ష్యాలను సీఎం అధికారులకు నిర్దేశించారు.

ఇనాం భూముల సమస్యకు పరిష్కారం

దశాబ్దాలుగా రైతులకు తలనొప్పిగా మారిన ఇనాం భూముల సమస్యపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. 1.37 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఇనాం భూములను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా (22-A) నుంచి తొలగిస్తున్నారు. దీనివల్ల రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు వస్తాయి. మిగిలిన మరో లక్ష ఎకరాల సర్వీస్ ఇనాం భూములకు కూడా చట్టపరమైన చిక్కులు తొలగించి యజమానులకు అధికారం కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఇళ్లకు రిజిస్ట్రేషన్ వెసులుబాటు

2016 కంటే ముందు ప్రభుత్వ హౌసింగ్ పథకాల కింద పట్టాలు పొందిన సుమారు 13.59 లక్షల మంది లబ్ధిదారులకు ఇది శుభవార్త. ఇకపై వారు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆ ఇళ్లను అమ్ముకోవడానికైనా, పిల్లలకు బహుమతిగా ఇవ్వడానికైనా లేదా బ్యాంకు రుణాలు పొందడానికైనా మార్గం సుగమం అవుతుంది. సుమారు 9.25 లక్షల ఎకరాల భూమిపై యజమానులకు త్వరలోనే పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి.

బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రక్షణ

భూ రికార్డుల భద్రత కోసం ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను రంగంలోకి దింపుతోంది. రికార్డుల డిజిటలైజేషన్ పూర్తి చేసి, సాఫ్ట్ కాపీని నేరుగా యజమాని మొబైల్‌కు పంపుతారు. రికార్డ్ లాకింగ్ సదుపాయం ద్వారా యజమాని అనుమతి లేకుండా భూమికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయడం సాధ్యం కాదు. ఎవరైనా మార్పులు చేయాలని చూస్తే వెంటనే యజమానికి అలర్ట్ వెళ్లేలా భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్నారు. పారదర్శకతతో కూడిన ఈ చర్యల ద్వారా భూ కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Tags:    

Similar News